జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు తమ పార్టీ బాసటగా నిలిచి పోరాటం చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) తెలిపారు. ఈనెల 20న అన్ని జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్(job calendar)లో చేర్చాలని డిమాండ్ చేశారు. లక్షల్లో ఉద్యోగాలు(jobs) కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైకాపా చెప్పిన మాటలు నమ్మిన నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ను చూసి నిరాశకు గురైందన్నారు.
2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు..
గత రెండేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం.. అందుకు సంబంధించిన పోటీ పరీక్షల కోసం సుమారు 30 లక్షల మంది యువతీయువకులు ఎన్నో కష్టాలను ఓర్చుకొని సిద్ధమవుతున్నారని అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చివరకు జాబ్ క్యాలెండర్లో 10వేల ఉద్యోగాలను మాత్రమే చూపడం ఖచ్చితంగా యువతను వంచించడమే అవుతుందన్నారు. తాము ఏ విధంగా మోసపోయామో నిరుద్యోగ యువతీయువకులు.. ఎంత ఆవేదన చెందుతున్నారో తెలిపిన తీరు తనను కంటతడి పెట్టించిందన్నారు.
36 ఖాళీలు మాత్రమేనా..
గ్రూప్-1, 2 విభాగాల్లో కేవలం 36 ఖాళీలను మాత్రమే చూపించడం బాధాకరమన్నారు. కొద్ది నెలల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగాల భర్తీపై సమీక్షిస్తే గ్రూప్- 1, 2ల్లో సుమారు వెయ్యి ఖాళీలు గుర్తించారన్నారు. జాబ్ క్యాలెండర్లో 36 మాత్రమే ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ ఉద్యోగాలకు సుమారు 20 లక్షల మంది వరకూ పోటీ పడతారని.. పోటీ పరీక్ష ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఈ విధంగా విద్యార్థుల ఆశలను ప్రభుత్వం సొమ్ము చేసుకొంటుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మెగా డీఎస్సీ ఏమైంది..?
అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టులు వేల కొద్దీ ఖాళీలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పిన మెగా డీఎస్సీ(mega dsc) ఏమైపోయింది? అని నిలదీశారు. పోలీసు శాఖలో ఏడు వేలకుపైగా ఖాళీల భర్తీ గురించి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భరోసా కలిగించలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు.. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి లభించని పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని.. అలాగే ఇప్పటికే ఉన్న పరిశ్రమలు విస్తరణకు నోచుకోవట్లేదని దుయ్యబట్టారు. అటు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాలను(Employment) మన రాష్ట్ర యువత పొందలేకపోతున్నారని.. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నవారికీ అడియాశలే మిగిలాయని వాపోయారు. నిరుద్యోగుల తరఫున జనసేన(janasena) పార్టీ పోరాటం చేస్తుందని పవన్ తెలిపారు.
ఇదీ చదవండి..