రాష్ట్రంలో దెబ్బతిన్న ప్రతి రోడ్డూ బాగుపడే వరకు జనసేన గళమెత్తుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రహదారుల దుస్థితిని జనసేన వెలుగులోకి తేవడం వల్లే రాష్ట్రం ప్రభుత్వం కళ్లు తెరిచి రోడ్ల నిర్మాణంపై ఆలోచన మొదలుపెట్టిందని పవన్ తెలిపారు. లక్షల మంది రహదారి కష్టాలను చెప్పినందునే వర్షాలు తగ్గాక రోడ్డు మరమ్మతుల ప్రక్రియ మొదలుపెడతామని ప్రభుత్వం వెల్లడించిందని పేర్కొన్నారు.
అక్టోబర్ తర్వాత టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను నిర్ణయించి పనులు మొదలుపెట్టే సరికి సంక్రాంతి వస్తుందన్న పవన్.. ఇక పనులెప్పుడు పూర్తవుతాయోనని ఎద్దేవా చేశారు. అప్పటివరకూ ప్రజలకు ఈ గోతుల రోడ్లే గతి అన్నారు. రోడ్లపై వైకాపా ప్రభుత్వానికి నిజంగా శ్రద్ధ ఉంటే వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జనసేన కార్యకర్తలు తమ పరిధిలో ఏ రోడ్డు ఎన్ని కిలోమీటర్ల మేర దెబ్బతింది, మరమ్మతులు సరిపోతాయా లేక పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలా అనే వివరాలు సేకరించాలని పవన్ సూచించారు. అభివృద్ధి చేయాల్సిన రోడ్డును మరమ్మతులతో సరిపెట్టే పక్షంలో ప్రశ్నించేందుకు ఈ వివరాలు అవసరపడతాయని పేర్కొన్నారు.