ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసి ఏడాదిన్నరపైనే అవుతోంది. ఫలితాలొచ్చి పది నెలలు గడిచిపోయాయి. అయినా జైలు వార్డరు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ శిక్షణ కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. 3 సార్లు తేదీలను ఖరారు చేసి రద్దు చేయటంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు.
2,800కు పైగా కానిస్టేబుల్, ఫైర్‌మెన్, జైలువార్డరు పోస్టుల భర్తీ కోసం 2018 నవంబరులో నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది సెప్టెంబరులో ఫలితాలొచ్చాయి. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి ఆ వెంటనే శిక్షణ మొదలైంది. ఈ నెలలోనే పోస్టింగులు ఇవ్వనున్నారు. కానీ వారితోపాటు ఎంపికైన 89 మంది జైలు వార్డర్ల శిక్షణకు ఆటంకాలు తప్పట్లేదు.