ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jagan Cases: రూపాయి లేకుండా రూ.1,246 కోట్ల పెట్టుబడి - తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

కొందరు వ్యక్తులకు తండ్రి అధికారం ద్వారా లబ్ధి చేకూర్చి.. వారి నుంచి పెట్టుబడుల రూపంలో ముడుపులు సేకరించడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి పక్కా ప్రణాళిక రూపొందించారంటూ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. జగతి పబ్లికేషన్స్‌లో సొంతంగా రూపాయి పెట్టుబడి పెట్టకుండా.. రూ.1,200 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టడంలో జగన్‌, సాయిరెడ్డిలు కీలక పాత్ర పోషించారంది. ఇదే విషయాన్ని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెటిరో హెల్త్‌కేర్‌లో విచారణ జరిపి, సమర్పించిన నివేదికలో ప్రస్తావించినట్లు తెలిపింది.

ముడుపుల వసూళ్లకు జగన్ కుట్ర
ముడుపుల వసూళ్లకు జగన్ కుట్ర

By

Published : Nov 8, 2021, 9:56 PM IST

Updated : Nov 9, 2021, 4:34 AM IST

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై సీబీఐ కేసును కొట్టివేయాలంటూ హెటిరో కంపెనీతోపాటు డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్‌ వాదనలు వినిపిస్తూ తండ్రి అధికారాన్ని ఉపయోగించి ఇతరులకు ప్రయోజనాలు కల్పించడం ద్వారా జగన్‌ అక్రమ లబ్ధి పొందారన్నారు. ‘పిటిషనర్లు పెట్టుబడులు, భూకేటాయింపులను వేర్వేరుగా చెబుతున్నారు. అది సరికాదు. ఆ రెండింటిలోని అంశాలను కలిపి చూసినపుడే కుట్ర బయటపడుతుంది. ఇందులో హెటిరో కంపెనీ, ఎండీల పాత్రలను వేర్వేరుగా చూడలేం. బలమైన అనుమానాలున్నందునే సీబీఐ ముందుకెళ్లింది.

హెటిరో హెల్త్‌కేర్‌లో కేంద్రం తనిఖీ చేసి ఇచ్చిన నివేదికలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలున్నాయి. జగతిలో వాటాలను ఇతరులకు అమ్మడానికి వీల్లేదని, వాటాదారులు కుటుంబసభ్యులకు మాత్రమే బదలాయించాలన్న షరతు ఉంది. వాటాలను విక్రయించుకోలేకుండా, లాభాలు లేకుండా పెట్టుబడులు పెట్టారు. హెటిరో రూ.1,173 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. వారికి దక్కింది కేవలం 30 శాతమే! జగన్‌ కేవలం రూ.73 కోట్ల పెట్టుబడితో 70 శాతం వాటా పొందారు. ఆ రూ.73 కోట్లు కూడా ఆయనకు చెందిన కార్మెల్‌ ఏసియా, సండూర్‌ పవర్‌ల నుంచి వచ్చాయి. వాటిలోనూ ఇతరులే పెట్టుబడులు పెట్టారు.

అంటే.. రూపాయి వెచ్చించకుండా రూ.1,246 కోట్ల పెట్టుబడులను జగన్‌ రాబట్టారు. అధికార దుర్వినియోగం, ప్రజా విశ్వసనీయతను దెబ్బతీయడం.. అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తాయి. అందులోనూ ఈ కేసు ప్రస్తుతం డిశ్ఛార్జి పిటిషన్‌ల దశలోనే ఉంది. సీబీఐ పూర్తి విచారణ జరిపితేనే.. ఆధారాలతో కేసును రుజువు చేయగలదు. హెటిరో పెట్టిన పెట్టుబడులను సమర్థించుకోవడానికి వీలుగా విజయసాయిరెడ్డి డెల్లాయిట్‌ నుంచి పాత తేదీతో వాల్యుయేషన్‌ నివేదిక తెప్పించారు. వాటాల విక్రయానికి అవకాశం లేదని, లాభాలు లేవని.. అన్నీ తెలిసే ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి’ అని సీబీఐ న్యాయవాది వాదించారు.హెటిరో, అరబిందో కంపెనీలకు చేసిన భూకేటాయింపుల్లో ప్రజాప్రయోజనం, అభివృద్ధి తదితరాలున్నపుడు నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారో చెప్పాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘భూకేటాయింపుల్లో పరిణామాలను బట్టి.. జగన్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయి. 2006 నవంబరులో రూ.2 కోట్లు, 2007 మార్చిలో హెటిరో రూ.3.88 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తదనుగుణంగా ఆ సంస్థకు 50 ఎకరాల భూకేటాయింపు జరిగింది.

2008లోనూ పెట్టుబడులు పెట్టిన తర్వాతే 75 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వంలో ఫైళ్ల కదలికను బట్టి పెట్టుబడులు వెళ్లాయి’ అని వాదించారు. హెటిరో కంపెనీ వ్యవహారాలతో.. డైరెక్టర్‌గా తన బాధ్యత లేదన్న శ్రీనివాసరెడ్డి వాదనను సీబీఐ న్యాయవాది తోసిపుచ్చారు. డైరెక్టర్లందరినీ నిందితులుగా చేర్చలేదని, కీలక పాత్ర పోషించిన వ్యక్తినే చేర్చామన్నారు. నిబంధనల ప్రకారమే సీబీఐ కోర్టు అభియోగ పత్రాన్ని విచారణకు పరిగణించిందని, అందువల్ల ఈ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. ఈ ఆరోపణలకు సమాధానం ఇస్తామని హెటిరో తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

ఇదీ చదవండి

Chandrababu: అభ్యర్థుల జాబితా ప్రకటించకుండా ఏకగ్రీవాలు ఎలా ప్రకటిస్తారు?

Last Updated : Nov 9, 2021, 4:34 AM IST

ABOUT THE AUTHOR

...view details