Petitions Withdrawn On Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించాలంటూ అయిదేళ్ల క్రితం దాఖలు చేసిన పిటిషన్లను మరో ఇద్దరు నిందితులు ఉపసంహరించుకున్నారు. ఇటీవల దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా తన పిటిషన్ వెనక్కి తీసుకోగా.. ఇవాళ ఇందూ టెక్ జోన్, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసుల్లో ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, ఇందూ టెక్ జోన్ ఛార్జ్షీట్లో నిందితుడిగా ఉన్న బీపీ ఆచార్య క్వాష్ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు.
అయిదేళ్ల క్రితం దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వద్ద ఇవాళ విచారణకు వచ్చాయి. వాదనలు వినిపించాల్సిన సమయం రాగానే.. క్వాష్ పిటిషన్లు వెనక్కి తీసుకునేందుకు నిందితుల తరఫు న్యాయవాది అనుమతి కోరారు. అయిదేళ్ల పాటు స్టే కొనసాగిన తర్వాత.. విచారణకు రాగానే వెనక్కి తీసుకోవటం పట్ల సీబీఐ తరఫు న్యాయవాది సురేంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ వెనక్కి తీసుకొని సీబీఐ కోర్టులో కొత్త వివాదం లేవనెత్తి.. మళ్లీ అక్కడ కాలయాపన మొదలు పెడతారని వాదించారు. నిందితుల క్వాష్ పిటిషన్ల ఉపసంహరణకు అనుమతిచ్చిన హైకోర్టు.. మళ్లీ పిటిషన్లు దాఖలు చేస్తే వీలైనంత త్వరగా విచారణ ముగించాలని సీబీఐ కోర్టును ఆదేశించింది.