ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీలో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలున్నాయి: గౌతమ్​రెడ్డి - IT Minister Goutham Reddy Latest News

ఆంధ్రప్రదేశ్​లోని వివిధ రంగాల్లో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలున్నాయని... రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కంపెనీల సీఈఓలకు వివరించింది. సీఎక్స్ఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పేరిట నిర్వహించిన సదస్సుకు హాజరైన వేర్వేరు ఐటీ కంపెనీల నుంచి కరోనా అనంతర పరిణామాలతో పాటు దిద్దుబాటుకు చేపట్టాల్సిన చర్యలపైనా విస్తృతంగా చర్చించింది. ఐటీ శాఖ ఆధ్వర్వంలో నిర్వహించిన సదస్సుకు 76 ఐటీ సంస్థల ప్రతినిధులు హాజరైనట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో విశాఖను ఐటీ కేంద్రంగా తయారు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

గౌతమ్​రెడ్డి
గౌతమ్​రెడ్డి

By

Published : Apr 2, 2021, 7:16 PM IST

గౌతమ్​రెడ్డి

ఈ ఏడాది మే నెలాఖరున నీతి ఆయోగ్-నాస్కామ్ సంయుక్త భాగస్వామ్యంలో పెట్టుబడుల గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని.. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖను ఐటీ డెస్టినేషన్​గా మారుస్తామని చెప్పారు. ఐటీ రంగంలో కరోనా అనంతర పరిస్థితులు, దిద్దుబాటు చర్యలపై ఐటీ శాఖ సీఎక్స్​ఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పేరిట... వివిధ ఐటీ సంస్థల సీఈఓలతో సదస్సు నిర్వహించింది. ఐటీ రంగానికి ఎక్కువమంది నిపుణులను అందిస్తున్న రాష్ట్రంగా ఏపీలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అత్యంత కీలకమని మంత్రి మేకపాటి వ్యాఖ్యానించారు. దీనికి రాష్ట్రం అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని మంత్రి వెల్లడించారు. విద్యా రంగం, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ రంగం, ఆరోగ్యం తదితర రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని.. ఏపీలో మూడు కాన్సెప్ట్ సిటీలను నిర్మించాలని భావిస్తున్నామని చెప్పారు. విశాఖలో 5జి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, జెనెటిక్స్ రంగాల్లో పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

ప్రభుత్వ ప్రోత్సాహం...

ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమ ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీ శాఖ కార్యదర్శి జి.జయలక్ష్మి స్పష్టం చేశారు. మానవవనరుల అభివృద్ధికి ఐటీ అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్య, అధ్యయనం, పరిశోధన రంగాల్లో ఐటీ అనుసంధానం పెరగాలని, నైపుణ్యాభివృద్ధిలోనూ ఐటీకి విస్తృతమైన అవకాశాలున్నాయని...అందిపుచ్చుకునేందుకు పెట్టుబడులు ఏపీకి రావాల్సి ఉందని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర స్పష్టం చేశారు.

కొత్త సాంకేతికత అవసరం...

వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ ఐటీ వినియోగాన్ని గణనీయంగా పెంచామని... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్​లు సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలోని అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఐటీ సీఈఓలకు వివరించారు. పంటల నుంచి పశువుల వరకూ కియోస్క్​లలో నమోదు అవుతున్నాయి. విత్తనాలు, ఉత్పత్తి, పంట మార్కెటింగ్, పశువులకు రోగాలు, వాటికి చికిత్స లాంటి అంశాలను కియోస్క్​ల ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు. వ్యవసాయోత్పత్తి పెరిగేందుకు డ్రోన్ సాంకేతికత ఉపకరిస్తోందని... ఆధునిక యువత వ్యవసాయంపై మక్కువ పెంచుకుంటున్నారని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తికి, మార్కెటింగ్​కు ఉపకరించేలా కొత్త సాంకేతికతను తీసుకురావటంలో ఐటీ కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఆశిస్తోందని ఆమె తెలిపారు.

ఏపీలోని 30 శాతం జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లోనే నివసిస్తోందని.. ప్రణాళికల్లేకుండా నిర్మించిన నగరాల్లో నివసించాల్సిన పరిస్థితి ఉందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మీ వ్యాఖ్యానించారు. సహజ వనరుల్ని ఇష్టారీతిని వినియోగించి ప్రకృతిని ధ్వంసం చేశామని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ధ్వంసాన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈ రంగంలో పెట్టుబడులకూ విశేషమైన అవకాశాలున్నట్టు ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా అనంతర పరిస్థితుల కారణంగా వర్క్ ఫ్రం హోం, వాక్ టూ వర్క్ విధానాలు కొత్తగా అనుభవంలోకి వచ్చాయని... వీటిపై మరింత సాంకేతికత ప్రజలకు అందుబాటులోకి రావాలని ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రజారోగ్యం, వ్యక్తి ఆరోగ్యం ఇప్పుడు ప్రామాణికాలుగా మారిపోయాయని... కాంటాక్ట్​లెస్ టెక్నాలజీలపైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉన్నందున... సాంకేతిక రంగంలో పెట్టుబడులకు అవకాశాలున్నట్టు ఐటీ సీఈవోలు స్పష్టం చేశారు. పెట్టుబడులకు ఉన్న అడ్డంకుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

ఇదీ చదవండీ... మా నాన్నది రాజకీయ హత్యే: సునీతారెడ్డి

ABOUT THE AUTHOR

...view details