తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలమంది అక్రమమార్గంలో జీఆర్ఈ స్కోరు సాధించారు. గుంటూరు కేంద్రంగా విదేశాలకు విద్యార్థులను పంపే కొన్ని ఏజెన్సీలు ఈ దందా సాగిస్తుండగా.. ఇటీవలే విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లోనూ ఇలాంటివి పుట్టుకొచ్చాయి. అయితే.. ఇలా అక్రమమార్గంలో అమెరికా వచ్చినా రోజూ భయపడుతూనే బతకాల్సి వస్తుందని, ఏ క్షణంలోనైనా దొరికిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అక్రమ దందాపై కొన్ని రోజులుగా నిఘా పెట్టిన ‘ఈనాడు’.. దీనిపై పూర్తి వివరాలు సేకరించి అందిస్తున్న ప్రత్యేక కథనం...
పరీక్ష ఎలా?
అమెరికాలోని ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు అకడమిక్ స్కోరుతో పాటు జీఆర్ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. జీఆర్ఈ స్కోర్ అధికంగా ఉంటే సీటుతోపాటు ఉపకారవేతనాలూ లభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్కోరు ఐదేళ్ల వరకు చెల్లుబాటవుతుంది. బాగా చురుకైన విద్యార్థులకే 300-320 మార్కులు సాధించడం కష్టం. అందుకే అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు ఈ పరీక్ష కోసం రాత్రింబవళ్లు కష్టపడతారు. ఇందులో క్వాంటిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, ఎనలిటికల్ రైటింగ్ ఉంటాయి. వీటిలో మొదటి రెండింటికీ కలిపి గరిష్ఠంగా 340 మార్కులు, ఎనలిటికల్ రైటింగ్‌కు 6 పాయింట్లు ఉంటాయి. అందువల్ల రీజనింగ్ పరీక్షలే కీలకం. పరీక్ష సమయం 3.45 గంటలు. కరోనా కారణంగా ఈసారి జీఆర్ఈ పరీక్షను ఇంటినుంచే రాసుకునే వెసులుబాటు కల్పించారు. గత సెప్టెంబరు నుంచి పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నా.. ఎక్కువమంది ఆన్లైన్ పరీక్షే రాస్తున్నారు. ఇదే అక్రమార్కులకు వరమైంది.
అక్రమాలు ఇలా..
1జీఆర్ఈ రాయాలనుకునే విద్యార్థి ముందుగా ఏజెన్సీని సంప్రదించాలి. వాళ్లే పరీక్ష రాసేందుకు రిజిస్టర్ చేసుకునే సమయం చెబుతారు. దీనికి విద్యార్థే 213 డాలర్ల పరీక్ష రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలి. అప్పుడే పరీక్ష తేదీలను కేటాయిస్తారు. వాటిని ఏజెన్సీకి అందించాలి. విద్యార్థి కోరుకున్న మార్కులను బట్టి డబ్బులు ముందే చెల్లించాలి.
2పరీక్షకు ముందు కంప్యూటర్ కెమెరాతో పరీక్ష రాసే గది మొత్తాన్ని 360 డిగ్రీల కోణంలో చూపించాలి. గదిలో ఎవ్వరూ ఉండకూడదు. గది మొత్తం పరిశీలన పూర్తయిన తర్వాత పరీక్ష రాసే టేబుల్‌పై కంప్యూటర్ను పెడతారు. దీనికి అమర్చిన కెమెరా 90 డిగ్రీల కోణంలో ఉంటుంది. విద్యార్థి పక్కకు తిరిగినా.. తల తిప్పినా ఆన్లైన్ కెమెరా పసిగట్టేసి పరీక్షను అక్కడే ఆపేస్తుంది.
3పరీక్ష రాయించేచోట ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత రహస్యంగా గదిలోకి ప్రవేశిస్తున్నారు. కెమెరా 90డిగ్రీల కోణంలో ఉండటంతో కంప్యూటర్ పక్కనుంచి ప్రశ్నపత్రాన్ని ఫొటోలు తీస్తున్నారు. అనంతరం జవాబు చిట్టీలను కీబోర్డు సమీపంలో ఉంచుతున్నారు. అభ్యర్థి తల తిప్పకుండానే పరీక్ష రాసేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.