ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పుడు పెగాసస్‌ కొనలేదు.. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: ఏబీవీ - పెగాసస్ న్యూస్

పెగాసస్‌ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. నిఘా విభాగాధిపతిగా తాను పనిచేసిన కాలంలో పెగాసస్‌ను కొనలేదని.., వాడలేదని తేల్చిచెప్పారు. ఉద్దేశపూర్వకంగా తనపై వ్యక్తిత్వ హననానిని పాల్పడ్డారని ఆరోపించారు. పెగాసస్‌పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

Pegasus latest news
Pegasus latest news

By

Published : Mar 21, 2022, 6:09 PM IST

Updated : Mar 22, 2022, 5:12 AM IST

పెగాసస్‌పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరావు స్పష్టం చేశారు. ఫోన్ల గోప్యతపైనా ప్రజలకు అనేక అనుమానాలున్నాయని.. ప్రజల భయం, ఆందోళనకు తెరదించాలని పేర్కొన్నారు.పెగాసస్‌ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను..ఆయన ఖండించారు. నిఘా విభాగాధిపతిగా తాను పనిచేసిన కాలంలో పెగాసస్‌ను కొనలేదని..వాడలేదని తేల్చిచెప్పారు. పెగాసస్‌ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఎవరికీ తెలీదన్నారు. ఆ రాష్ట్రంలో నాకు తెలిసిన కొందరు అధికారుల్ని అడిగా... ఆ సాఫ్ట్‌వేర్‌ను అమ్ముకోవడానికి వెళ్లినవారు ఆమెను కలిసినప్పుడు.. ఫలానా వారు కొన్నారని ఆమెకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చని వారు నాతో అన్నారని తెలిపారు. ట్రోజన్లు, మాల్‌వేర్‌లు వంటివీ ప్రభుత్వపరంగా వినియోగించలేదని చెప్పారు. 2015 నుంచి 2019 మార్చి నెలాఖరు వరకూ తాను నిఘా విభాగాధిపతిగా కొనసాగానని.. ఆ తర్వాత రెండు నెలల వరకూ ఏం జరిగిందో తెలుసని చెప్పారు. తన హయాంలో ఫోన్లు ఏవీ ట్యాప్‌ కాలేదన్న భరోసా ఇస్తున్నానని చెప్పారు.

2019 మే తర్వాత పెగాసస్‌ కొన్నారో లేదో నాకు తెలీదు

‘పెగాసస్‌ వ్యవహారంలో 2019 మే తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే తాము పెగాసస్‌సాఫ్ట్‌వేర్‌ కొనలేదంటూ 2021 ఆగస్టులో డీజీపీ కార్యాలయమే సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తికి సమాధానమిచ్చింది. ఇతర విభాగాలు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొన్నాయేమోనన్న సందేహం ఎవరికైనా ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడగొచ్చు. ఈ అంశంపై ప్రభుత్వమే ఒక ప్రకటన చేసినా ఫరవాలేదు. జనాల్లో అపోహలు, సందేహాలు, ఆందోళనలు రేకెత్తించేందుకే పెగాసస్‌ వ్యవహారంలో కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై కనీసం శాఖాపరమైన విచారణ జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. ఈ వ్యవహారంలో అసత్యాలు, విష ప్రచారాలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌, సీపీఆర్వో పూడి శ్రీహరి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గుడివాడ అమరనాథ్‌, అబ్బయ్య చౌదరి, విజయసాయిరెడ్డి, పయనీర్‌ పత్రిక, స్వర్ణాంధ్ర, గ్రేటాంధ్ర వెబ్‌సైట్లపై పరువు నష్టం దావా వేయడానికి అనుమతివ్వాలని సీఎస్‌ కార్యాలయంలో సోమవారం వినతిపత్రమిచ్చా.

నాపై విచారణకు ఏనాడూ వెనకాడలేదు

నాపై ప్రభుత్వం జరిపిన విచారణలో నేను వెనక్కి తగ్గలేదు. తాత్సారం చేసే ఎత్తుగడలు వేయలేదు. పది, పన్నెండేళ్లు సాగదీయాలనుకోలేదు. ఈ రోజు రాలేను.. రేపు రాలేను.. ఫలానా కారణాలతో రాలేను.. పిటిషన్‌ అక్కడ పెండింగ్‌లో ఉంది. ఇక్కడ పెండింగ్‌లో ఉంది అంటూ ఏ రోజూ తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. త్వరగా విచారణ జరిపి నిజానిజాలేమిటో తేల్చమనే అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం నాపై విచారణ జరిపి సర్వీసు నుంచి డిస్మిస్‌ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సమ్మతి కోసం ప్రతిపాదనలు పంపించింది. వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నేనూ కేంద్రాన్ని కోరాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని పత్రాలు రాలేదని వారు చెబుతున్నారు. నా సస్పెన్షన్‌ చెల్లదని, అది చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. ఏడాదిగా అక్కడ పెండింగ్‌లో ఉంది. వీటిలో జాప్యానికి నేను కారణం కాదు.

ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పినవన్నీ అబద్ధాలే

* ఆంధ్రప్రదేశ్‌లో 37 మంది డీఎస్పీలకు పదోన్నతులిస్తే 35 మంది ఓ సామాజికవర్గం వారే ఉన్నారని, అందుకు ఏబీ వెంకటేశ్వరరావే కారణమంటూ 2019 ఎన్నికలకు ముందు ఓ వ్యక్తి చేతిలో కాగితాలు ఊపుతూ మరీ ఎన్నికల సంఘానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అదంతా అబద్ధమని ఇప్పుడు హోం మంత్రే అసెంబ్లీలో చెప్పారు.

*ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల వ్యవహారంలో అప్పట్లోనే మాకు నోటీసులొచ్చాయి. హోంశాఖ తరఫున సమాధానాలిచ్చాం. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత.. ఆరు నెలలకు వైవీ సుబ్బారెడ్డి కేసు ఉపసంహరించుకున్నారు. సజ్జల వేసిన కేసులో పిటిషన్‌దార్ల తరఫున ఎవరూ హాజరు కావట్లేదంటూ కోర్టే డిస్మిస్‌ చేసింది.

అవి కొంటే.. వారు మావోయిస్టుల దాడిలో బలయ్యేవారు కాదు

‘అప్పట్లో నేను ప్రతిపాదించిన ఏరోస్టాట్‌, యూఏవీ పరికరాలు కొని ఉంటే అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలు జరిగి ఉండేవి కావు. వారిని కాపాడుకోగలిగే వాళ్లం. ఛత్తీస్‌గఢ్‌లో పదుల సంఖ్యలో సైనికులు మావోయిస్టుల దుశ్చర్యకు బలైపోయేవారు కాదు.

* వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో నాకు తెలిసిన విషయాల్ని సీబీఐ అధికారులకు చెప్పాను’ అని వివరించారు.

* ‘నాకు రెండేళ్ల సర్వీసు ఉంది. దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలి. రెండేళ్ల తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం.’ (రాజకీయాల్లోకి వస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా)

ఐపీఎస్‌ అధికారిగా ఉండటమే.. నా బలహీనత అనుకుంటే ఎలా?

ఐపీఎస్‌ అధికారిగా ఉండటమే నా బలం అనుకున్నా. దాన్నే నా బలహీనతగా వారు భావిస్తే ఎలా? ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నన్నేమైనా అనొచ్చా? ఇలా అయితే అఖిల భారత సర్వీసు అధికారుల్లో అభద్రతభావం రాదా? దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాల నుంచి ప్రజల్ని రక్షిస్తూ వచ్చిన నేను ఇప్పుడు వాటికే బలైపోయాను. నన్ను నేనే రక్షించుకోలేకపోతే ప్రజల్ని ఏం రక్షిస్తాను? నా ఉద్యోగ ధర్మాన్ని ఎలా నిర్వహిస్తాను? ఈ రోజు నేను ఎదుర్కొంటున్న పరిస్థితే రేపు మరో అధికారికి రావచ్చు. ఇలా అయితే బ్యూరోక్రసీ అంతా బెంబేెలెత్తిపోదా? అందరూ భయపడిపోయి పారిపోతే దుర్మార్గుల నుంచి ప్రజల్ని రక్షించేది ఎవరు?

అధికారుల్ని బంతాట ఆడుకోవచ్చు అనుకుంటున్నారా?

అఖిల భారత సర్వీసు అధికారులను బంతాట ఆడుకోవచ్చు.. ఉద్యోగుల్ని ఫుట్‌బాల్‌ ఆడుకోవచ్చు. వారేమీ చేయలేరులే.. అనే ధోరణితో ఉంటే ఎలా? ఉద్యోగులమే కానీ మేమూ మనుషులమే. మాకంటూ వ్యక్తిత్వం ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు అఖిల భారత సర్వీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు సంబంధిత అధికారికి వాటిని ఖండించే హక్కు నియమావళిలోనే ఉంది. అందుకే నేను మాట్లాడుతున్నా.

అబద్ధపు శిలువ మోయాల్సి వచ్చింది...

నన్ను సస్పెండ్‌ చేసిన రోజు అర్ధరాత్రి సీపీఆర్వో పూడి శ్రీహరి ఆరు పేజీల డాక్యుమెంటును మీడియాకు విడుదల చేశారు. రూ.25 కోట్ల కుంభకోణానికి, దేశద్రోహానికి పాల్పడినట్లు, దేశ రహస్యాలను విదేశాలకు చేరవేసినట్లు అందులో అసత్య ఆరోపణలు చేశారు. 2020 ఫిబ్రవరిలో నన్ను ప్రభుత్వం సస్పెండు చేయగా డిసెంబరు 18న నాపై అభియోగాలు మోపుతూ ఉత్తర్వులిచ్చింది. వాటిలో ఎక్కడా పూడి శ్రీహరి విడుదల చేసిన డాక్యుమెంటులోని ఆరోపణలు లేవు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదన్న సత్యం.. నాపై జరిగిన విచారణలో తేటతెల్లమైంది. కానీ శ్రీహరి చేసిన అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం వల్ల అన్ని నెలలపాటు నేను ఆ అబద్ధపు శిలువ మోయాల్సి వచ్చింది’ అని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Lokesh On Pegasus: పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధం: నారా లోకేశ్‌

Last Updated : Mar 22, 2022, 5:12 AM IST

ABOUT THE AUTHOR

...view details