ప్రశ్న: ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కొత్త వైరస్ స్టెయిన్ వివరాలు ఏంటి..?
జవాబు: వైరస్లలో మ్యూటేషన్లు, వేరియేషన్లు రావడం సాధారణమే.. వైరస్ మనిషి శరీరంలోని కణాలలోనికి వెళ్లి దాడిచేసి అందులోని ప్రొటీన్ కణాలను నాశనం చేసిన తరువాత.. వాటిని వైరస్‌గా మార్చి బయటకు వచ్చేటపుడు వందలు వేలు లక్షల వైరస్‌గా మారి కణంలో నుంచి బయటకు వస్తాయి. అత్యంత వేగంగా ఈ చర్య జరిగే క్రమంలో వైరస్‌లో మ్యూటేషన్లు చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మానవ శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని సార్లు అది వైరస్ ఎక్కువగా మ్యూటేషన్ చెందేందుకు దోహదమవుతుంది. అ సమయంలో వైరస్ కణాల్లోని జీన్సులో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా కరోనా వైరస్‌లో కొత్తగా మ్యూటేషన్ కనిపించింది. సెప్టెంబరులోనే యు.కెలో తొలుతగా కొందరిలో గుర్తించారు. కానీ దాని పూర్తి ప్రభావం వారంరోజుల క్రితమే పూర్తిగా తెలిసింది. కొత్తగా వచ్చిన మ్యూటేషన్‌పై పూర్తిస్థాయిలో అధ్యయనాలు కొనసాగుతున్నాయి. కొత్తగా గుర్తించిన వైరస్‌కు VUI 202012 - virus variation under investigation 202012 గా పిలుస్తున్నారు. కరోనాలో ఇప్పటివరకు 23కుపైగా మ్యూటేషన్లు వచ్చాయి. వాటిలో 17 ఈ మధ్యే వచ్చాయి. బాగా తెలివిగా మారిపోతున్న వైరస్ వేగవంతంగా మార్పులు చెందుతోంది. వైరస్‌లో అత్యంత కీలకమైన స్పైక్ ప్రొటీన్‌లో 7 మార్పులు వచ్చాయి. వాటిలో 2 ముఖ్యమైనవి.. తాజాగా వచ్చిన మార్పుల వల్ల వైరస్ ఉదృతంగా మారింది.
ప్రశ్న: ప్రపంచ వ్యాప్తంగా టీకా అందుబాటులోకి వస్తున్న సమయంలో వైరస్‌లో వస్తున్న మార్పులనేవి ఆందోళనకరమేనా..? దీని వల్ల ప్రమాదం ఏ స్థాయిలో ఉండవచ్చు?
జవాబు:ఈ పరిస్థితి కొంత ఆందోళనకరమే..! ఈ వేరియేషన్ ద్వారా వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. ఇంతకు ముందు కొవిడ్ జాగ్రత్తలు విధిగా పాటించడం వల్ల ఈ వైరస్ వ్యాప్తిని చాలా వరకు అదుపు చేయగలిగాం. కానీ కొత్తగా వచ్చిన మ్యూటేషన్వేగంగా వ్యాప్తి చెందడం వల్ల అదుపు కష్టమవుతోంది. కానీ పాత వైరస్ కంటే ఇప్పుడు వచ్చింది ప్రమాదకరమైది కాదు. శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపడం లేదు. పాత వైరస్‌తో సమానంగానే రోగులను ఇబ్బంది పెడుతోంది.
ప్రశ్న: అంటే మాస్క్ , శానిటైజర్ లకు వైరస్ లొంగదా?
జవాబు:భద్రతా చర్యలు పాటిస్తే వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇంతకు ముందున్న వైరస్ ఒక వ్యక్తి శరీరంలోకి వెళ్లాక.. కొన్ని రోజుల తర్వాత ఇతరులకు వ్యాపించేది. ఈ కొత్త స్ట్రెయిన్ అనేది.. వైరస్ వచ్చిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వెంటనే వ్యాపిస్తోంది... కాబట్టి రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుంది.
ప్రశ్న: యూకేలో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది...?
జవాబు:యూకేలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. భారత్ కంటే ముందుగానే ఇక్కడ వ్యాపించింది. మధ్యలో తగ్గినట్లే తగ్గి రెండో వేవ్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది మూడో వేవ్ అనుకోవచ్చు. లండన్ దాని చుట్టుపక్కల పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు జరుగుతోంది. ఇళ్లలో ఉండే వారు వేరే వారిని కలవడానికి కూడా అనుమతిలేదు. అనవసరంగా పౌరులు బయట ప్రయాణాలు చేయకుండా ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ప్రశ్న: ఇప్పుడు యూకేలో వస్తున్న కేసులన్నీ కొత్త స్ట్రెయిన్ వల్లే వస్తున్నాయా..? రోగుల్లో వ్యాధి లక్షణాల్లో మార్పులు వచ్చాయా? పాత చికిత్సా విధానం దీనికి ఉపకరిస్తోందా?
జవాబు: కొత్త వైరస్‌ను సెప్టెంబరులో గుర్తించినప్పుడు 5-10 శాతంలో మందిలో మాత్రమే ఉంది. ఇప్పుడు పరిశీలిస్తే.. 70-80 శాతం మందికి వ్యాప్తి చెందుతున్నట్టుగా గుర్తించారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో 100శాతం కేసులు కొత్త వేరియంట్ ద్వారానే వస్తాయి. రోగ లక్షణాల్లో కూడా మార్పు లేదు. రోగుల సంఖ్య కూడా మరీ ఎక్కువుగా పెరగలేదు. చికిత్సా విధానం కూడా అంతే..!
ప్రశ్న: మరి కంగారు ఎందుకు ?
జవాబు:ఎందుకంటే.. ఆసుపత్రులపై భారం పెరుగుతోంది.. ఈ వైరస్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ 70శాతం వేగంగా వ్యాప్తి అనుకున్నారు. కానీ అది అంతకన్నా ఎక్కువుగానే ఉన్నట్లు గుర్తించారు. ఇంతకు ముందు నూటికి ఒకరు చనిపోయారు అనుకుంటే.. ఇప్పుడు రోగుల సంఖ్య పెరగడం వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అది ఆందోళనకరమే కదా..! వైరస్ దాడిని ఎదుర్కొనేందుకు మానవవనరులు, సమయం చాలా వరకు సరిపోదు. ఒక వ్యక్తి నుంచి సగటున ఎక్కువ మందికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది . దానిని ఎదుర్కొని అరికట్టడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు అత్యవసరం.
ప్రశ్న:కొత్త వేరియంట్ పిల్లలకు ఎక్కువుగా వ్యాపిస్తోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంత వరకు వాస్తవం.. ?
జవాబు:కొత్త వైరస్ చిన్న పిల్లలకు పాతవైరస్తో పోలిస్తే ఎక్కువుగానే సోకుతోంది. వారికి తెలీకుండానే వాళ్లకు వస్తోంది. పిల్లలకు ఇబ్బంది లేకపోయినా.. వారి ద్వారా ఇతరులకు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని అంచనాల్లో తేలింది.
ప్రశ్న:మ్యూటేషన్ జరిగిన తర్వాత వైరస్‌లో డిలీషన్లు జరుగుతున్నాయని.. దీని ద్వారా వైరస్ మనలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ ప్రభావం నుంచి తప్పించుకుని వేగంగా వ్యాపిస్తుందని సమాచారం .ఇది ఎంత వరకు వాస్తవం?