ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ ఏడాది నుంచే నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అమలు: హేమచంద్రారెడ్డి - ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డితో ముఖాముఖి

జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. కొత్త విద్యా సంవత్సరాన్ని నవంబరు 2 నుంచి ప్రారంభించి ఆగస్టు తొమ్మిదికల్లా పూర్తి చేయనున్నట్లు ఈటీవీ భారత్ ముఖాముఖిలో తెలిపారు.

interview with apsche chairman hemachandra reddy about reopening of education institutions
ఈ ఏడాది నుంచే నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అమలు: హేమచంద్రారెడ్డి

By

Published : Oct 30, 2020, 11:07 PM IST

జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. కొత్త విద్యా సంవత్సరాన్ని నవంబరు 2 నుంచి ప్రారంభించి ఆగస్టు తొమ్మిదికల్లా పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కొంత ఆన్‌లైన్‌, మరికొంత ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తూ మూడో వంతు విద్యార్థులు కళాశాలకు నెలలో 10రోజులు హాజరయ్యేలా ప్రణాళికలు రచించామన్నారు. తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు బృందాలుగా విభజించటంతో పాటు పరీక్షలు అదే తరహాలో నిర్వహిస్తామన్నారు.


ప్ర:కరోనా క్లిష్ట పరిస్థితుల తర్వాత కళాశాలలు, విద్యాసంస్థల ప్రారంభోత్సవానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు ?

జ:డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల తరగతుల్ని నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. విద్యాసంవత్సరాన్ని విద్యార్థులు నష్టపోకుండా కొర్సు మొత్తం అందించేలా ప్రణాళికను సిద్ధం చేశాం. మొదటి సెమిస్టర్ నవంబర్ 2వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు నడుస్తుంది. వెంటనే పరీక్షలు నిర్వహించి మార్చి 25వ తేదీ నుంచి రెండో సెమిస్టర్ ప్రారంభిస్తాం. అది ఆగస్టు 9కల్ల పూర్తవుతుంది. 2021-22విద్యాసంవత్సరాన్ని ఆగస్టు 15తర్వాత ప్రారంభించి మే కల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు రచించుకున్నాం.

ప్ర:విద్యార్థులు కరోనా బారీన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జ. అన్ని కరోనా జాగ్రత్తలూ పాటించేలా నిబంధనలు రూపొందించి కళాశాలకు పంపించాం. కొంత ఆన్‌లైన్‌, మరికొంత ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు. కళాశాల విద్యార్థులలో 1/3 వంతు చొప్పున విడతల వారీగా 10 రోజులపాటు తరగతుల్లో పాఠాలు బోధిస్తారు. ఆ తర్వాత మొదటి బ్యాచ్‌కు ఆన్‌లైన్‌లో పాఠాలు ఉంటాయి. మరో బ్యాచ్‌ 1/3 విద్యార్థులు తరగతులకు హాజరవుతారు. మొత్తం ఒక సెమిస్టర్‌కు సంబంధించిన 90 రోజుల్లో 30 రోజులపాటు విద్యార్థులకు తరగతులు ఉంటాయి. వసతి గృహాలను ఇదే విధానంలో కేటాయిస్తారు. తరగతులకు వచ్చిన వారికి వసతి గృహం సదుపాయం కల్పిస్తారు. విద్యార్థులు విడతల వారీగా మారుతూ ఉంటారు. వంద కిలోమీటర్ల కంటే దూరం నుంచి వచ్చే విద్యార్థులకు మాత్రం సెమిస్టర్‌ మొత్తం వసతి కల్పిస్తారు. ఏదైనా తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు గ్రూపులుగా విభజిస్తారు. సీట్ల మధ్య ఆరడుగుల దూరం ఉంటుంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా... కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు తగ్గట్టుగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. జిల్లా స్థాయిలో విశ్వవిద్యాలయం స్థాయిలో ఈ టాస్క్ ఫోర్సు బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంటాయి. విద్యార్థులు ఒకరినొకరు కలవకుండా చూసుకోవటం, క్రీడా వినోదాలు రద్దు తదితర అంశాలు నిబంధనల్లో పొందుపరిచాం. పరీక్షలు నిర్వహణ కూడా అందరికీ ఒక్కసారిగా కాకుండా 1/3వంతు విధానంలో నిర్వహిస్తాం. ఇంటర్నల్ అసైన్మెంట్ మార్కులకు సంబంధించి రోజూ వారి విద్యార్థి హాజరు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకునేలా సంస్కరణలు తీసుకొచ్చాం. నాణ్యతా ప్రమాణాలను ప్రతీ విద్యాసంస్థా పాటించాలి. పాటించని వాటిపై అందుకనుగుణంగా చర్యలుంటాయి. వీలైనంతవరకూ సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నాం. పూర్తిగా నాణ్యతా ప్రమాణాలు పాటించని విద్యాసంస్థలకు ఈసారి అడ్మిషన్లు తీసుకునే అర్హత కోల్పోతాయి.


ప్ర.జాతీయ విద్యా విధానం 2020ని రాష్ట్ర ప్రభుత్వం ఏమేర అమలుచేస్తోంది.


జ.జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా 4ఏళ్ల డిగ్రీ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. డిగ్రీ మూడో సంవత్సరం తర్వాత విద్యార్థి కావాలంటే బయటకు వెళ్లిపోవచ్చు లేదా 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించాం. రానున్న రోజుల్లో లోటుపాట్లు సరిచేసుకుని జాతీయ విద్యా విధానానికి తగ్గట్లుగా మరిన్ని సంస్కరణలు చేపడతాం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details