tidco houses: నెల్లూరు పట్టణానికి చెందిన ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం 430 చదరపు అడుగుల విస్తీర్ణం గల గృహాన్ని కేటాయించింది. గతేడాది జులైలో లబ్ధిదారు పేరుతో ఓ బ్యాంకు రూ. 3.65 లక్షల రుణాన్ని టిడ్కోకు మంజూరు చేసింది. ఇప్పటివరకు అసలు, వడ్డీ కలిపి రూ. 3.85 లక్షలు అయింది. ఇల్లు ఇప్పటికీ లబ్ధిదారునికి స్వాధీనం చేయలేదు. వడ్డీ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.
టిడ్కో గృహాల విషయంలో ప్రభుత్వ జాప్యం లబ్ధిదారులకు పెనుభారంగా మారుతోంది. లబ్ధిదారుల పేరుతో బ్యాంకులు అందించిన రుణంపై వడ్డీ కొండలా పేరుకుపోతోంది. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం రెండేళ్ల గడువు తీరకుండానే వడ్డీ కట్టాలని లబ్ధిదారులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇటు అద్దె, అటు వడ్డీ రెండూ చెల్లించలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కొంతమంది బ్యాంకు ఖాతాలు ఎన్‌పీఏగా మారాయి. వాటికి సంబంధించిన వడ్డీని టిడ్కోనే భరిస్తోంది. ప్రతి మూడు నెలలకూ ఒకసారి బ్యాంకులకు కడుతోంది. ఇలా ప్రజాధనం వృథాగా మారుతోంది.
ఒప్పందం ప్రకారం రెండేళ్ల తర్వాత వాయిదాలు చెల్లించాలి. గతంలో ఓ బ్యాంకు రుణం మంజారు చేసిన మొదటి నెల నుంచే వాయిదాలు కట్టాలని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై టిడ్కో అధికారులు ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినా కొన్నిచోట్ల పరిస్థితిలో మార్పురాలేదని అధికారులు చెబుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ లబ్ధిదారునికి గడువు తీరక ముందే వడ్డీ చెల్లించాలని బ్యాంకులు నోటీసులు జారీ చేసి వసూలు చేపట్టాయి. నాలుగు నెలలుగా ఆ వ్యక్తి వడ్డీ కడుతున్నారు. గత నెల రూ. 1,720 చెల్లించారు. ఆ కుటుంబం అద్దె, వడ్డీ రెండూ కట్టలేక అవస్థలు పడుతోంది. ఈ పట్టణంలో మరో సుమారు 200 మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరికొన్ని జిల్లాల్లోనూ ఇలాగే నోటీసులు వస్తున్నాయి. కొందరు చెల్లిస్తుండగా, మరికొందరు కట్టడం లేదు. వడ్డీ వసూలు విషయం తమ దృష్టికి రాలేదని టిడ్కో ఉన్నతాధికారులు చెబుతున్నారు.