వాణిజ్య సముదాయాలు, రేకుల షెడ్లలో కొనసాగుతున్న జూనియర్ కళాశాలలకు ఈ ఒక్క ఏడాదికి అనుమతి ఇస్తూ ఇంటర్ విద్యామండలి ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో గడువు పొడిగించినట్లు తెలిపారు. అగ్నిమాపక ధ్రువపత్రాలు లేని కళాశాలలకు 60 రోజుల గడువుతో అనుమతి ఇచ్చారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు సీట్ల సంఖ్యను నమోదు చేయనందున వాటిలోని వివరాలు ఇంటర్ బోర్డు మంజూరు చేసిన గ్రూపులు, సెక్షన్ల ప్రకారం ఆన్‌లైన్‌లో ఉంచారు.
కొత్తగా మంజూరు చేసిన 208 కళాశాలలతో కలిపి, మొత్తం 7,42,780 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. కొత్తగా మంజూరైన 84 జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించారు. విద్యార్థుల ప్రవేశాలను బట్టి అతిథి అధ్యాపకులతో ఖాళీలు భర్తీ చేసుకునేందుకు ప్రిన్సిపళ్లకు అనుమతిమిచ్చారు. ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో 237 మంది జేఎల్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు.