ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బియ్యం కార్డు ఉంటేనే బీమా.. వేగంగా సర్వే - VJA_Insurance only for ration card holders_Eenadu

జిల్లాలో వైఎస్సార్‌ బీమా నమోదు కార్యక్రమంలో భాగంగా వేగంగా సర్వే కొనసాగుతోంది. ఇందులో నమోదు కావాలంటే బియ్యం కార్డు తప్పనిసరి చేయగా.. చాలామంది అర్హత కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

Insurance only for ration card holders
బియ్యం కార్డు ఉంటేనే బీమా...

By

Published : Sep 29, 2020, 5:23 PM IST

జిల్లాలో వైఎస్సార్‌ బీమా నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సర్వే వేగవంతంగా సాగుతోంది. ఇందులో నమోదు కావాలంటే బియ్యం కార్డు తప్పనిసరి చేయడంతో చాలామంది అర్హత కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

సాగుతున్న సర్వే

ఈ బీమా పథకం అమల్లో భాగంగా వార్డు, గ్రామ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. బియ్యం కార్డు ఉన్న 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవారు పథకానికి అర్హులు. కుటుంబాన్ని పోషించే వ్యక్తిని మాత్రమే లబ్ధిదారునిగా పరిగణించి కుటుంబసభ్యుల్లో ఒకరిని నామినీగా గుర్తిస్తున్నారు.

వయసు ప్రాతిపదికన సహజ, ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి పథకంలో భాగంగా ఆర్థికసాయం అందిస్తారు. కార్మిక, సంక్షేమ, ఉపాధి కల్పనశాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. జిల్లావ్యాప్తంగా అర్హులు అందరికీ వైఎస్సార్‌ బీమా గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇంట్లో ఒకరికి..

గతంలోనే ఈ బీమా పథకం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం పలుమార్పులు చేసి వైఎస్సార్‌ బీమా పథకం పేరిట అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కార్డులో కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింప చేశారు. ప్రస్తుతం కుటుంబ సంరక్షకునికి మాత్రమే వర్తించేలా మార్పులు చేశారు. కుటుంబంలో మిగిలిన సభ్యుల్లో ఎవరైనా సహజమరణం పొందినా, ప్రమాదవశాత్తు మరణం సంభవించినా పథకం వర్తించదు. ఇప్పటివరకూ మూడెకరాల మాగాణి, పదెకరాల మెట్ట ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా పరిగణిస్తున్నారు.

ఇందుకు భిన్నంగా వైఎస్సార్‌ బీమాపథకం నిబంధనలు తీసుకురావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. బియ్యం కార్డు నిబంధన కారణంగా ప్రస్తుతం పలు సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్న వారిలో చాలామంది బీమా అర్హత కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా 11లక్షలకుపైగా బియ్యం కార్డులు ఉన్నాయి. జిల్లాలో బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారితోపాటు ఇంకా పంపిణీ చేయాల్సినవి వేల సంఖ్యలో ఉన్నాయి. వారందరి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. వివిధ ప్రాంతాల్లో ఇంకా 52 వేల మంది బియ్యంకార్డులు పొందాల్సి ఉంది. దీంతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు కూడా ఉన్నారు.

బ్యాంకు ఖాతాలు లేనివారూ ఎక్కువే!

బియ్యం కార్డులు పొందినవారిలో కూడా బ్యాంకు ఖాతాలు లేనివారు అనేక మంది ఉన్నట్లు అధికారులు నిర్వహించిన సర్వేలో గుర్తించారు. జిల్లాలోని ప్రతి మండలంలోనూ ఇలాంటి వారు ఉన్నారు. వీరందరూ బ్యాంకు ఖాతాలు తెరవకపోయినా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గతంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న లక్ష్యంతో జన్‌ధన్‌ ఖాతాలు తెరవాలని అధికారులను ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఆ దిశగా అవగాహన కల్పించకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. ఇలా బీమా పథకం అమల్లో ఉన్న నిబంధనల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

అర్హులందరినీ నమోదు చేస్తాం

ప్రభుత్వ నిబంధనల ప్రకారణం బీమా పథకంలో నమోదు కావాలంటే బియ్యంకార్డు ఉండాల్సిందే. ప్రస్తుతం బియ్యం కార్డులు సచివాలయాల ద్వారా త్వరితగతిన అందిస్తున్నందున అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. బ్యాంకు ఖాతాలు లేని వారందరి చేత జన్‌ధన్‌ఖాతాలు తెరిపించాలని నిర్ణయించాం. ఆదిశగా అన్ని మండలాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అర్హులందరినీ బీమా పథకంలో నమోదు చేసేలా కృషి చేస్తున్నాం.

ఇదీ చదవండి:

కొవిడ్ నిబంధనలతో ఎడ్​సెట్​కు ఏర్పాట్లు పూర్తి

ABOUT THE AUTHOR

...view details