ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dredging works: రూ.272 కోట్ల డ్రెడ్జింగ్‌ పనులపై కన్ను - ap latest news

Dredging works: ఉభయగోదావరి జిల్లాల్లో కాటన్‌ బ్యారేజి ఎగువన కుడి, ఎడమన డ్రెడ్జింగ్‌ పనులు అర్హతలు లేకున్నా ఒక గుత్తేదారుకు అప్పచెప్పేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రూ.272.36 కోట్లతో రెండు ప్యాకేజీలుగా ఈ పనులకు టెండర్లు పిలిచారు.

inspections on rs.272 crore worth dredging works
రూ.272 కోట్ల డ్రెడ్జింగ్‌ పనులపై కన్ను

By

Published : Jul 6, 2022, 8:19 AM IST

Dredging works: ఉభయగోదావరి జిల్లాల్లో కాటన్‌ బ్యారేజి ఎగువన కుడి, ఎడమన డ్రెడ్జింగ్‌ పనులు అర్హతలు లేకున్నా ఒక గుత్తేదారుకు అప్పచెప్పేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రూ.272.36 కోట్లతో రెండు ప్యాకేజీలుగా ఈ పనులకు టెండర్లు పిలిచారు. ఆ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసి గుత్తేదారుడిని ఖరారు చేయాల్సి ఉన్నా అది మధ్యలోనే ఆగిపోయింది. టెండర్లు పిలిచి, వాటిని తెరిచి, గుత్తేదారుల సాంకేతిక అర్హతలు పరిశీలించిన అధికారి హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టి వెళ్లిపోయారు.

దాదాపు 15 రోజుల పాటు ఆయన సెలవులోనే ఉన్నారు. ఈ లోపు జలవనరులశాఖలో బదిలీల ప్రక్రియ సాగింది. అలా సెలవుపై వెళ్లిన అధికారికి ప్రస్తుతం వేరే పోస్టింగు దక్కింది. ఆయనను ఎలాంటి ప్రాధాన్యం లేని నీరు చెట్టు ఎస్‌ఈగా నియమించారు. ఇప్పుడు గోదావరి ఎస్‌ఈగా అదనపు బాధ్యతల్లో ఉన్న అధికారి ఈ టెండర్లపై దృష్టి సారించాల్సి ఉంది. టెండర్ల ప్రక్రియ చేపట్టిన అధికారి హఠాత్తుగా సెలవుపై వెళ్లడమూ, ఇప్పటికీ ఈ ప్రక్రియ కొలిక్కి రాకపోవడం చర్చనీయాంశమవుతోంది.

అర్హతలపై సమగ్ర నోట్‌..అఖండ గోదావరిలో కాటన్‌ బ్యారేజి ఫోర్‌ షోర్‌లో ఇసుక డ్రెడ్జింగ్‌కు రూ.272.36 కోట్లతో ఈ శాఖ పాలనామోదం ఇచ్చింది. ఎల్‌ ఎస్‌ పద్ధతిలో ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టారు. గోదావరి ఎడమ వరద గట్టు 3కి.మీ నుంచి 12.150 కి.మీ వరకు రూ.144.23 కోట్లతో, కుడి వైపు వరద గట్టు 3కి.మీ నుంచి 12.150 కి.మీ వరకు రూ.128.13 కోట్లతో టెండర్లు పిలిచారు.

ఒక ప్యాకేజికి సంబంధించి ముగ్గురు గుత్తేదారులు, మరో ప్యాకేజికి ఒక గుత్తేదారు మాత్రమే టెండర్లు వేశారని అధికారులు చెబుతున్నారు. గుత్తేదారుల సాంకేతిక అర్హతలకు సంబంధించిన బిడ్‌ను అధికారులు తెరిచారు. వారి వారి అర్హతలను పరిశీలించారు. జీవో 94 ప్రకారం ఎవరెవరికి ఏయే అర్హతలు ఉన్నాయో, ఎవరికి అర్హతలు లేవో ఒక సమగ్ర నోట్‌ తయారు చేసి అప్పటి సూపరింటెండెంటు ఇంజినీరు (ఎస్‌ఈ) ఉన్నతాధికారులకు పంపారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ గుత్తేదారుడికి జీవో 94 ప్రకారం అవసరమైన అర్హతలు లేకున్నా.. ఆయనకే పనులు అప్పగించాలనే ఒత్తిళ్లు కొన్ని స్థాయిల్లో వచ్చినట్లు తెలిసింది.

ఫోర్‌ షోర్‌ ఏరియాలో డ్రెడ్జింగ్‌ చేసిన అనుభవం లేకున్నా, ప్రస్తుతం పిలిచిన టెండరుకు సంబంధించి అదే తరహా పని, నిర్దేశించిన మొత్తానికి చేసిన అర్హత లేకున్నా ఆ గుత్తేదారుడికే పనులు అప్పగించాలని ఉన్నత స్థాయిలో కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇంతలో సంబంధిత ఎస్‌ఈ సెలవుపై వెళ్లడం గమనార్హం. ఆ ఎస్‌ఈతో మాట్లాడేందుకు ‘ఈనాడు’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయనను ఎలాంటి ప్రాధాన్యం లేని ఏలూరు జిల్లా నీరు చెట్టు ఎస్‌ఈగా నియమించారు.

తెరవెనుక సంప్రదింపులు..ఒక ప్యాకేజికి ముగ్గురు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేశారు. అందులో అర్హతలు ఉన్న కంపెనీకి కాకుండా వేరే సంస్థకు పనులు అప్ప చెప్పే ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్ని అర్హతలు ఉన్న గుత్తేదారు ఈ అంశాన్ని వివాదం చేయకుండా ఉండేందుకు ఆయనతో తెరవెనుక సంప్రదింపులు జరుగుతున్నాయి.

మూడేళ్ల కిందట తూర్పు డెల్టాలో ఒక డ్రెయిన్‌ డ్రెడ్జింగ్‌ పనులకు ఈయన కూడా టెండరు దాఖలు చేశారు. ఏ కారణం చేతనో అప్పట్లో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు ఆ పనులు ఆయనకు అప్పగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్ర స్థాయి కమిటీకి నివేదిస్తాను: ఇన్‌ఛార్జి ఎస్‌ఈ..ఈ వ్యవహారంపై ప్రస్తుతం గోదావరి ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహమూర్తిని ‘ఈనాడు’ వివరణ కోరగా.. ‘నేను ఈ పోస్టులో అదనపు బాధ్యతల్లో ఉన్నాను. అన్నీ పరిశీలించి నిబంధనల ప్రకారం చేస్తాను. టెండర్ల ప్రక్రియ ఏ దశలో ఉంది. ఆర్థిక బిడ్‌ ఇంకా తెరిచారా లేదా అన్నది నేను దృష్టి సారించలేదు. అన్నీ పరిశీలించి రాష్ట్ర స్థాయి కమిటీకి నివేదిస్తాను..’ అని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details