కారులో హత్యకు గురైన పారిశ్రామికవేత్త రాహుల్ కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితులపై దృష్టి సారించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే... హత్యకు దారితీసిన కారణాలు తెలుసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు విజయకుమార్, పద్మజ, గాయత్రి పరారీలో ఉన్నారు. హత్య ఘటనలో విజయ్‌కుమార్‌కు నేరుగా ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు అతను కారులోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
కోరాడ విజయ్‌కుమార్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బెంగళూరు, విశాఖ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశం ఉండొచ్చని నిర్ధరణకు వచ్చారు. కోరాడ పట్టుబడితే కేసు మిస్టరీ వీడే అవకాశముంది. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది.. తెర వెనుక ఎవరు ఉన్నారు వంటి కీలక విషయాలు బయటకొస్తాయి. కోరాడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటంతో... అతని అనుచరులపై పోలీసులు నిఘా పెట్టారు. వారి ఫోన్‌కాల్స్‌పై దృష్టి సారించారు. ఇప్పటికే కొందరు అనుచరులను అదుపులోకి తీసుకుని గుట్టుగా ప్రశ్నించగా... పలు కీలక విషయాలు తెలిసినట్లుగా సమాచారం.