ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. విజయదశమిని పురస్కరించుకుని ఇవాళ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తున్నారు. చెరకు గడను ఎడమచేతిలో ధరించి.. కుడి చేతితో అభయాన్ని ప్రసాదింపజేసే రూపంతో షోడశాక్షరీ మహామంత్రి స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందే రాజరాజేశ్వరిదేవిని దర్శించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాజరాజేశ్వరిదేవిని అపరాజితాదేవి అని పిలుస్తారు. అన్ని లోకాలకు ఈమే ఆరాధ్యదేవత. దేవలందరి సమష్టి స్వరూపంగా జ్యోతి స్వరూపంతో ప్రకాశిస్తూ పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుంటుంది. శ్రీచక్రాన్ని అధిష్టించి, యోగమూర్తిగా అమ్మవారు దర్శనమిస్తోంది. రాజరాజేశ్వరిదేవిని పూజించడం ద్వారా మనో చైతన్యం ఉద్దీపితమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సమున్నతమైన దైవికశక్తి రాజరాజేశ్వరిదేవి సొంతం. శాశ్వతమైన ఆనందానికి, విజయానికి అమ్మవారు ప్రతీక.
శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున సాయంత్రం నిర్వహించే తెప్పోత్సవ సేవకు అధికారులు అభ్యంతరం తెలిపారు. కృష్ణానదికి వరద పోటెత్తుతున్నందున గంగా సమేత దుర్గామల్లేశ్వరుల ఉత్సవమూర్తులను హంస వాహనంపై ముమ్మారు నదీ విహారం చేయించే ప్రక్రియను రద్దు చేశారు. దుర్గాఘాట్ వద్ద నదిలోనే హంస వాహనాన్ని ఉంచి పూజించాలని నిర్ణయించారు. హంస వాహనంలోకి ఎనిమిది మంది వేదపండితులు, ఇద్దరు అర్చకులు, ఇద్దరు కర్రపు స్వాములు, ఇద్దరు కాగడాలు పట్టేవారు, ఆరుగురు భజంత్రీలవారు, ఒక ఎస్‌ఐను మాత్రమే అనుమతిస్తారు. అమ్మవారి ఆలయంలో భక్తుల పరోక్షంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు.