కరోనా మహమ్మారితో ఏర్పడుతున్న తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడంలో దేశానికి మద్దతుగా నిలవడానికి వినూత్న ఆలోచనతో భారతీయ రైల్వే ముందుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు.. 2020 మార్చి నుంచి జూన్ మధ్యలో రైల్వే బోగీలను కొవిడ్ రక్షిత కోచ్‌లుగా మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సిహెచ్ రాకేష్ తెలిపారు. పౌరులకు వీలైనంత త్వరగా సహాయపడాలని యుద్ధప్రాతిపదికన కార్యాచరణను అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం భారతీయ రైల్వేలోని అనేకమంది సిబ్బంది, ఆరోగ్య నిపుణులు, వైద్యులు, ఇంజనీర్లు కలిసి పని చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం సిద్ధం చేసిన ప్రత్యేక బోగీలను.. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చోట వారి వైద్య సదుపాయాలు, పరికరాలతో వినియోగించుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు దేశవ్యాప్తంగా 16 జోన్లలో బోగీలు ఉన్నాయన్నారు. కరోనా రెండో విడత నుంచి బయటపడేందుకు తమ సహకారం ఉండడంపై అధికారి రాకేష్ హర్షం వ్యక్తం చేశారు.