75వ పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు త్రివర్ణ పతాకం ఆవిష్కరించి, అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రదర్శన కోసం వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలను సిద్ధం చేశాయి. కొవిడ్ ఆంక్షల దృష్ట్యా వేడుకలకు పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు.
స్వాతంత్ర్య దినోత్సవాలకు ఇందీరాగాంధీ మైదానంలో పెద్దఎత్తున ఏర్పాట్లుచేశారు. స్టేడియం లోపల, బయట తీసుకున్న భద్రతా చర్యలను డీజీపీ గౌతం సవాంగ్ పరిశీలించారు. మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్.. అధికారులకు పలు సూచనలు చేశారు. కరోనా దృష్ట్యా సాధారణ ప్రజలను వేడుకలకు అనుమతించడం లేదన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. విజయవాడ రాజ్‌భవన్, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంతోపాటు.. చుట్టుపక్కల రోడ్లు విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతున్నాయి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ భవనాలను మువ్వన్నెల జెండాలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు.