మద్యం కొనలేక, అలవాటు మానుకోలేక శానిటైజర్లు తాగుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. విజయవాడ నగరంలో ఒకేరోజు ఈ విధంగా ఇద్దరు మృతి చెందడం కలకలం రేపింది. కొత్తపేటలోని రాజగిరివారి వీధికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యం ధరలు భారీగా పెరిగిన వేళ.. కొనేందుకు సరిపడా డబ్బులు లేక శానిటైజర్ తాగడం మొదలుపెట్టాడు. ఆదివారం ఒక్కసారిగా వాంతులు, నోటి నుంచి నురగ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. గొల్లపాలెం గట్టు ప్రాంతంలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. బెజవాడ మధు అనే యువకుడు రైల్వే స్టేషను సమీపంలో బండిమీద బిర్యానీ విక్రయించేవాడు. లాక్ డౌన్ తర్వాత వ్యాపారం మూతపడగా మద్యం తాగేందుకు అతడికి సరైన ఆదాయం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే శానిటైజర్‌కు అలవాటు పడిన అతడు ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
మద్యానికి బదులుగా శానిటైజర్లు... పెరుగుతున్న మరణాలు - deaths in vijayawada news
ఓవైపు పడిపోయిన ఆదాయం, మరోవైపు భారీగా పెరిగిన మద్యం ధరలు... శానిటైజర్ చావులకు దారి తీస్తున్నాయి. కూలి పనులు చేసుకుంటూ జీవించే పలువురు మద్యం కొనలేక.. మత్తు కోసం శానిటైజర్‌పై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు వదులుతున్నారు. అసలే అంతంతమాత్రం బతుకులు... ఆపైన ఉన్న మగ దిక్కునూ కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
![మద్యానికి బదులుగా శానిటైజర్లు... పెరుగుతున్న మరణాలు police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11118914-832-11118914-1616473197894.jpg)
నగరంలో 10 రోజుల వ్యవధిలో ఈ విధంగా ఐదుగురు మరణించినట్లు సమాచారం. మల్లికార్జునపేట, కొత్తపేట ప్రాంతాల్లో ఆయా ఘటనలు చోటు చేసుకోగా రెండు సంఘటనలు మాత్రమే పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. వన్ టౌన్, టూటౌన్, భవానీపురం ప్రాంతాల్లో అనేకమంది మత్తు కోసం శానిటైజర్‌పైనే ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. సమస్యపై అధికారులు దృష్టిపెట్టి తగిన రీతిలో చర్యలు చేపట్టకుంటే మరెన్నో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి:70 మంది విద్యార్థినులకు అస్వస్థత