గ్రామ పంచాయతీల ఏకగ్రీవ ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెంచింది. ఇవి పార్టీ రహితం. గ్రామాలను ఏకగ్రీవం చేసుకుందాం. అభివృద్ధికి సోపానాలు వేసుకుందాం. కలసిమెలసి ఉందాం. ఒకే మాట మీద నిలబడదాం.
- స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఇది
పంచాయతీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవ పంచాయతీల ప్రోత్సాహకాల మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీన్ని చూపిస్తూ అప్పట్లో అధికార పార్టీ నాయకులు ఏకగ్రీవాల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఫలితంగా మొత్తం 13,371 గ్రామ పంచాయతీలకు 2,199 ఏకగ్రీవమయ్యాయి. ప్రభుత్వ జీఓ ప్రకారం... వీటికి రూ.125 కోట్లు ప్రోత్సాహకంగా అందాలి. ఎన్నికల ప్రక్రియ ముగిసి ఆరు నెలలైంది. ఇప్పటివరకు ప్రోత్సాహకాల ఊసే లేదు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు... ఎవరూ మాట్లాడటం లేదు.
బడ్జెట్‌లో వీటి కోసం రూ.30 కోట్లు చూపారు. అదనంగా మరో రూ.95 కోట్లు అవసరం. వీటిని మంజూరు చేసే దిశగా ఇంకా ప్రతిపాదనలే సిద్ధం కాలేదు.
లాంఛనాలన్నీ ఆలస్యమే
* గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించాక తీరిగ్గా ఏప్రిల్ 4న పాలకవర్గాల మొదటి సమావేశం నిర్వహించేందుకు ఉత్తర్వులు వచ్చాయి.
* సర్పంచులు బాధ్యతలు చేపట్టిన రెండు నెలల తర్వాత చెక్ పవర్ ఇచ్చారు.
* చెక్‌పవర్ కల్పించినా పంచాయతీల నిధులు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లడంతో సర్పంచుల పాత్ర నామమాత్రమవుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్తు బకాయిల కింద రూ.344.93 కోట్లను డిస్కలంకు ప్రభుత్వమే మళ్లించింది. పంచాయతీల్లో తీర్మానం లేకుండానే ఈ ప్రక్రియ పూర్తయింది.
* సాధారణ నిధుల నుంచి ఖర్చు చేసే ప్రతి రూపాయికి సీఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో బిల్లును అప్‌లోడ్ చేశాక... అవసరాన్ని బట్టి నిధులు కేటాయిస్తున్నారు. దీంతో సాధారణ నిధులతోపాటు ఆర్థిక సంఘం నిధుల ఖర్చుపై సర్పంచులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
నిధులు అందిస్తే ఊరట కలిగేది
- పి.ప్రతాప్, సర్పంచి పోలూరు, కర్నూలు జిల్లా