ప్రస్తుతం కరోనా ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటోంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు కృష్ణాలో నమోదవుతున్నాయి. రోజుకు వంద నుంచి 150 వరకు కేసులు కృష్ణాలో వస్తున్నాయి. గుంటూరులోనూ రోజుకు 70 నుంచి వంద కేసులొస్తున్నాయి. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతున్న కొద్ది వైరస్ ప్రభావం మరింత ఎక్కువవ్వనుంది. ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్న వారికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మూడు నెలల్లో చలి తీవ్రత తగ్గేవరకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం చలితో పాటు తుపాన్ల ప్రభావం వల్ల చల్లని గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. చల్లని గాలిలోకి ఒక్కసారి వచ్చినా.. జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి అనారోగ్య సమస్యల బారినపడతారని, కరోనా బారినపడి కోలుకున్న వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతోందన్నారు. ● కరోనా చికిత్స కోసం హైపవర్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్‌ను వినియోగిస్తారు. వీటి ప్రభావంతో శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఊపిరితిత్తులకు సమస్య ఉంటుంది. చలిగాలిలో బయటకు రావడం వల్ల వీరు నిమోనియా బారినపడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.ఊపిరితిత్తులకు ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది.
ఆస్తమా, మధుమేహం, టీబీ, హెచ్‌ఐవీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారికి ఈ వాతావరణం అంత మంచిది కాదు.
గాలికి దూరంగా.. ఏసీలు తక్కువగా..
చల్లని గాలి వీచే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎంత చల్లగా ఉన్నా ఏసీలను పెట్టుకుని ఉండడం చాలా మందికి అలవాటు. అందుకే.. వీలైనంత తక్కువగా ఏసీలను వినియోగించడం మంచిది. ఉదయం వేళ ఎండలో కచ్చితంగా కొంత సమయం ఉండాలి. ఇప్పటికే జలుబు, వైరల్ జ్వరాల బారినపడి ఆస్పత్రులకు వస్తున్నవారి సంఖ్య గత వారం పది రోజుల్లోనే గణనీయంగా పెరిగింది. కరోనా లక్షణాలు కూడా ఇవే కావడంతో వెళ్లిన వారందరికీ ముందుగా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఫలితాలు వచ్చాకే వైద్యం అందిస్తున్నారు. అందుకే ముందే అప్రమత్తంగా ఉండడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఫ్లూ, నిమోనియా బారిన...