కరోనా మహమ్మారి వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో అందరిలోనూ ఒకటే ఆలోచన. ఈ మహమ్మారి నుంచి మనల్ని, మన ప్రియమైన వారిని కాపాడుకోవడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి సమాచారం కోసం దినపత్రికలను తిరగేస్తున్నారు. మహమ్మారి బారిన పడకుండా... వైరస్ బాధితులకు దూరంగా ఉండటం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడంతోపాటు వ్యాధి నిరోధక శక్తి(ఇమ్యూనిటీ)ని కలిగి ఉండటమూ అత్యంత కీలకమేనని అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డయటెటిక్స్(అమెరికా)కు చెందిన ఆహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విటమిన్లు, ప్రోటీన్లతో కూడిన బలవర్థక ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏమేమి తినాలి... వాటి ప్రయోజనాలేమిటో వివరిస్తున్నారు.
క్యారెట్లు, ఆకుకూరలు...
శరీర ఇమ్యూనిటీకి చోదకంగా పని చేయడంలో విటమిన్-ఏ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్ల(విష కణాలు)లను, శరీరంలోకి చొరబడిన వైరస్‌లు, బ్యాక్టీరియాలను బయటకు నెట్టివేయడానికి వ్యాధి నిరోధక వ్యవస్థకు సాయం చేస్తుంది. క్యారెట్లు, ఆకుకూరలు, చిలగడదుంప, బ్రోకోలి, కాలే(క్యాబేజి కుటుంబానికి చెందిన ఆకుకూర), కీరా, మామిడి పండ్లు, కర్బూజా, యాప్రిక్యాట్లలో పుష్కలంగా లభించే బీటా కెరోటిన్ అనే పదార్థం విటమిన్-ఏగా రూపాంతరం చెందుతుంది.
కమలాలు... ద్రాక్షలు..
రక్తంలో యాంటీబాడీస్‌ను, తెల్ల రక్తకణాలను వృద్ధి చేయడంలో విటమిన్-సీ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. కమలాలు, ద్రాక్ష, కివీ పళ్లు, స్ట్రాబెర్రీలు, బెంగళూరు క్యాబేజీ, మిరియాలు, ఉడికించిన క్యాబేజీ, గోబీ పువ్వుల్లో విటమిన్-సీ అధికంగా లభిస్తుంది.
గుడ్లు... పాలు..
రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే ప్రోటీన్ ఉత్పత్తికి విటమిన్-డీ దోహదం చేస్తుంది. ఇది సూర్యరశ్మి నుంచే లభిస్తుంది. ఉష్ణ, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో సరిపడా ఎండ ఉంటున్నా... చాలామందిలో విటమిన్-డీ లోపం కనిపిస్తోంది. చేపలు, గుడ్లు, పాలు, చీజ్, వెన్న, పన్నీరు, పుట్టగొడుగులను తింటే ఈ విటమిన్‌ని సూర్యరశ్మి నుంచి శరీరం అధికంగా గ్రహిస్తుంది.