ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

private universities: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు 2000 - implementation of the convener quota seats in private universities

రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటా(convener quota in private universities) అమలుతో ఈ ఏడాది అదనంగా 2వేల ఇంజినీరింగ్‌ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. 4 వర్సిటీల్లో 35% కోటా కింద కన్వీనర్‌ సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ కోటా కింద 2,118 ఇంజినీరింగ్‌, 170 ఎంబీఏ సీట్లు అందుబాటులోకి వస్తాయి.

ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటా
ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటా

By

Published : Oct 19, 2021, 5:43 AM IST

ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటా అమలుతో ఈ ఏడాది అదనంగా 2వేల ఇంజినీరింగ్‌ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం కింద ఏర్పాటుచేసిన వర్సిటీలు రాష్ట్రంలో 8 ఉండగా.. వీటిలో నాలుగింట్లోనే ఇంజినీరింగ్‌ కోర్సులున్నాయి. శ్రీసిటీలోని క్రియా వర్సిటీ మేనేజ్‌మెంట్‌, ఇతర డిగ్రీ కోర్సులనే నిర్వహిస్తోంది. ఎస్‌ఆర్‌ఎం, విట్‌, భారతీయ ఇంజినీరింగ్‌ శాస్త్ర, సాంకేతిక ఇన్నోవేషన్‌, సెంచూరియన్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సులున్నాయి. 4 వర్సిటీల్లో 35% కోటా కింద కన్వీనర్‌ సీట్ల(convener quota in private universities)ను భర్తీ చేయనున్నారు. ఈ కోటా కింద 2,118 ఇంజినీరింగ్‌, 170 ఎంబీఏ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వీటి ప్రభావం ప్రైవేటు కళాశాలలపై పడనుంది. ఉత్తమ ర్యాంకు వచ్చినవారు ప్రైవేటు వర్సిటీలకే ప్రాధాన్యం ఇస్తారు. దీంతో ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు తగ్గనున్నాయి.

కన్వీనర్‌ కోటా ఫీజు ప్రత్యేకం..
ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటా ఫీజు ప్రత్యేకంగా నిర్ణయించనున్నారు. ఈ కసరత్తు పూర్తయింది. కన్వీనర్‌ కోటా కింద ప్రవేశాలు పొందేవారు విద్యాదీవెన పథకానికి అర్హులైతే ప్రభుత్వమే బోధన రుసుములను చెల్లిస్తుంది. అనర్హులు కన్వీనర్‌ కోటా ఫీజులను చెల్లించాలి. ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సోమవారం వర్సిటీ యాజమాన్యాలతో చర్చించి, ఫీజులను ఖరారు చేసి, ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. కమిషన్‌ నివేదికపై ప్రభుత్వం ఈనెల 22లోపు ఉత్తర్వులు జారీ చేయనుంది.

అనుమతుల నిలిపివేత..
రాష్ట్రంలో 56 ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ కళాశాలలకు విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు నిలిపివేశాయి. కొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు కలిపి 1,39,862 సీట్లకు అనుమతి తెలిపింది. కళాశాలల మూత కారణంగా 6వేల వరకు ఇంజినీరింగ్‌ సీట్లు తగ్గనున్నాయి. ప్రైవేటు వర్సిటీల సీట్లు 2వేలు కలవనున్నాయి. మొత్తంగా 1.35లక్షల సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

కొత్త కోర్సుల్లో 17వేల సీట్లు..
కొత్త కోర్సుల్లో 17,790 సీట్లు ఉంటాయి. వీటిని కంప్యూటర్‌ సైన్సులో భాగంగానే ప్రవేశపెట్టారు. కంప్యూటర్‌ సైన్సులో డేటాసైన్సు 3,660, కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ 4,890, కృత్రిమ మేధ, డేటాసైన్సు 4,320, కృత్రిమ మేధ 2,640, సైబర్‌ భద్రత 1,020, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ 1,260 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి లభించింది.

ఇదీ చదవండి..

AP EAPCET: ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఈనెల 22న ప్రకటన

ABOUT THE AUTHOR

...view details