విజయవాడ నగర నడిబొడ్డున ఆహారం కోసం ప్రతి రోజూ బారులు తీరుతున్న వారంతా బిచ్చగాళ్లు కాదు. తమకొచ్చిన పని చేసుకుంటూ ఇన్నాళ్లూ పొట్టనింపుకున్న వారు, కరోనా దెబ్బకు రోడ్డునపడ్డారు. దాతల ఆహార బండి కనిపిస్తే చాలు ఆకలితో పరుగులు పెట్టి క్యూలో నిల్చుంటున్నారు. కరోనా తీవ్రతతో విధించిన కర్ఫ్యూ వల్ల తలెత్తిన ఆహార సంక్షోభం.. పేద, దిగువ మధ్యతరగతిపై పంజా విసిరిన ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. వలస కార్మికులు, రోజుకూలీలు పని లేక పస్తులుండాల్సిన పరిస్థితి తలెత్తింది. రోజువారీ కూలీతో కుటుంబాన్ని పోషించుకునే వీరికి పనులు లేక అర్ధాకలితో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉపాధి లేక, అద్దె కట్టమంటున్న యజమానుల వేధింపులు తాళలేక.. ఇలా ఎవరైనా ఆహారం పెడితే తిని కడుపు నింపుకుంటున్నారు. పనిలేని ఈ ఆపత్కాలంలో ఎక్కడ ఆకలితో చనిపోతామేమో అనే భయం వీరిని వెంటాడుతోంది. ఉండేందుకు చోట లేక, చెయ్యడానికి పనిలేక తిండి పెట్టే దిక్కు కోసం ఇలా తపిస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్: రోడ్డున పడ్డ వలసకూలీలు.. కడుపు నింపుకునేందుకు పాట్లు - వలసకూలీల ఆకలి బాధలు
రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారివి. రోజంతా కష్టపడి కడుపునింపుకొనే వారు. అలాంటి వారి జీవితాలను కరోనా ఛిన్నాభిన్నం చేసింది. ఉపాధి, ఆహార భద్రతను దూరం చేసింది. కరోనా కర్ఫ్యూ కారణంగా హోటళ్లలోనూ, వాహన డ్రైవర్లగాను, ఇతరత్రా కూలీ పనులు చేసేవారికి పనిలేకపోవటం వల్ల ఆకలితో అలమటించిపోతున్నారు. కష్టపడి పనిచేసి గౌరవంగా కడుపుకునింపుకునే వారిని బిచ్చగాళ్లలా మార్చేసింది.
వలసకూలీల ఆకలి కష్టాలు
నగరంలో స్వచ్ఛంద సంస్థలు పేదలను ఉదారంగా ఆదుకుంటున్నాయి. తమకు తోచిన విధంగా పేదల ఆకలి తీర్చుతున్నాయి. ఆకలితో అలమటించి పోతున్న కొన్ని వందల మందికి ఆహారాన్ని పంచుతున్నా బాధితుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి పని దొరికేలా చేయడంతోపాటు.. ఆకలి కష్టాలు తీర్చే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.