- Telangana Illegal Constructions: హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉండి మూడున్నరేళ్ల క్రితం పురపాలక సంఘంగా మారిన దుండిగల్ పరిధిలో 2004 నాటి అనుమతులతో నిర్మాణాల వ్యవహారం వెలుగు చూసింది. పట్టణంలో విలీనమైన గాగిల్లాపూర్‌లో 18 ఏళ్ల నాటి అనుమతులతో విల్లాల నిర్మాణం జరుగుతున్నట్లు గుర్తించారు. పంచాయతీ అనుమతులతో కోట్ల రూపాయల విల్లాల నిర్మాణం చేపడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
- కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాల్లో పంచాయతీ అనుమతులతో భారీ సంఖ్యలో నిర్మాణాలు ఇప్పటికీ జరుగుతున్నట్లు వెల్లడైంది. నగరానికి కిలోమీటరు దూరంలోని విలీన గ్రామంలో కార్పొరేషన్ అధికారులు సర్వే చేస్తే వందకుపైగా అక్రమ నిర్మాణాల వ్యవహారం బయటపడింది. దీంతో ముందుకు ఎలా వెళ్లాలో తెలియక అధికారుల గందరగోళంలో పడ్డారు. వీటికి అనుమతులు ఎలా వస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
Corporation Permission For Building Construction: పురపాలకశాఖ పర్యవేక్షణ లోపం, సిబ్బంది కొరత అక్రమార్కులకు అవకాశంగా మారుతోంది. పట్టణాలుగా మారిన, నగరాల్లో అంతర్భాగమైన గ్రామాల్లో, పంచాయతీ అనుమతులతోనే భవనాలు వెలుస్తున్నాయి. 2018 ఆగస్టులో పలు గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చారు.. మరికొన్నిటిని నగరపాలక సంస్థల్లో విలీనం చేశారు.
వేలాది నిర్మాణాలు..
Municipal Permission For Building Construction: ఇది జరిగి మూడున్నర ఏళ్లయినా పాత పంచాయతీల అనుమతులతోనే వేలాది నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ విషయంలో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కొందరు బిల్డర్లు ఏళ్లనాడే అనుమతులు పొందినట్లు, పనులు పూర్తికానట్లు చెబుతూ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. సాధారణంగా గ్రామ పంచాయతీలకు గ్రౌండ్ ఫ్లోర్, మరో రెండు అంతస్తుల వరకు మాత్రమే అనుమతి ఇచ్చేందుకు అధికారం ఉంది. ఆపై భవనాల నిర్మాణానికి డీటీసీపీ అనుమతి తప్పనిసరి. విల్లాల నిర్మాణానికి పంచాయతీలు అనుమతి ఇచ్చే అవకాశమే లేదు. కానీ పంచాయతీల అనుమతులతో అనేక అంతస్తులతో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భవన నిర్మాణాలకు పంచాయతీలు ఇచ్చే అనుమతులు రెండేళ్ల వరకు మాత్రమే చెల్లుబాటవుతాయి. కానీ ఎప్పటివో అనుమతులు చూపి భవనాలు కట్టేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఇలాంటి ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. టీఎస్ బీపాస్ నిబంధనలు కఠినంగా ఉండడం, మార్గదర్శకాలను పక్కాగా పాటించాల్సి రావడంతో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలకు తెరతీస్తున్నారు.