సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తి, తదుపరి సీజీఐగా అందరూ భావిస్తున్న జస్టిస్ ఎన్.వి.రమణతో పాటు, రాష్ట్ర హైకోర్టులోని కొంతమంది న్యాయమూర్తులపై ఫిర్యాదు చేస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 6న సీజేఐకు రాసిన లేఖపై విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే పలువురు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయనిపుణులు ముఖ్యమంత్రి చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా దేశవ్యాప్తంగా ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన వందమంది విద్యార్థులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరును తప్పుబడుతూ ప్రధాన న్యాయమూర్తికి లేఖరాశారు. ముఖ్యమంత్రిది దౌర్జన్యపూరిత, నిరంకుశ, ఫాసిస్టు ధోరణి అంటూ తీవ్రపదజాలంతో తమ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చర్యలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, ఔన్నత్యానికి భంగకరమని ఆక్షేపించారు.
న్యాయవ్యవస్థకు బెదిరింపు..
ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు న్యాయవ్యవస్థను బెదిరింపులకు గురిచేసే విధంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గౌరవానికి భంగం కలిగేవిధంగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతోందని న్యాయ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. "స్వతంత్ర న్యాయవ్యవస్థ అనేది రాజ్యాంగంలో అత్యంత మౌలికమైన అంశమని, ప్రజాస్వామ్య పరిరక్షణలో అది ముఖ్యమైనదని, ప్రజల హక్కులను పరిరక్షించి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని నిలబెట్టడంలో న్యాయవ్యవస్థ ముఖ్యమైనదని మేం తరగతి గదుల్లో చదువుకున్నాం. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని దెబ్బతీయడమే కాక, దాని గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. దీనిని ఇలాగే సహించి వదిలేస్తే.. ప్రజల్లో న్యాయవ్యవస్థల పట్ల నమ్మకం కోల్పోవడానికి కారకులం అవుతాం" అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు చేస్తూ.. సీజేఐకు రాసిన లేఖ కచ్చితంగా న్యాయవ్యవస్థపై దాడే" అని విద్యార్థులు రాసిన లేఖలో పేర్కొన్నారు.
నిందితుడే ఆరోపిస్తారా..?
అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థను బెదిరించేందుకే సీజేఐకు లేఖ రాశారని విద్యార్థులు లేఖలో ప్రస్తావించారు. "సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ఏపీ హైకోర్టు కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు చేయడంతో పాటు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ రాకేష్ (లేఖలో రమేష్ అనిరాశారు..)లపై ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు. ఇవన్నీ దురుద్దేశపూర్వకమైన ఆరోపణలు. వాస్తవానికి ముఖ్యమంత్రే 31 కేసుల్లో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన నమోదు చేసిన 11కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నమోదు చేసిన 7 కేసులు కూడా ఇందులో ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న నేరాలకు సంబంధించిన విచారణ త్వరితగతిన పూర్తి చేయాలంటూ జస్టిస్ ఎన్వీరమణ ఇటీవలే రాష్ట్రాల హైకోర్టులకు ఆదేశాలిచ్చారు. జస్టిస్ ఎన్వీరమణపై ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశ్యాలు ఏంటో ఇక్కడే అర్థమవుతోంది" అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎఫ్.నారీమన్, జస్టిస్ వినీత్ శరణ్లపై ఇలాగే ఆధారరహితమైన ఆరోపణలు చేస్తే.. సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చిందని విద్యార్థులు లేఖలో ప్రస్తావించారు.
న్యాయాన్ని నిలబెడుతున్నాయి..
కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య తీవ్రమైన ఘర్షణ జరుగుతున్న ఈ తరుణంలోనూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయాన్ని నిలబెడుతోందని విద్యార్థులు తెలిపారు. "రాష్ట్రప్రభుత్వ అనైతిక, ప్రతీకార చర్యలను తట్టుకుంటూ కూడా ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షిస్తున్నారని విద్యార్థులు కొనియాడారు. రాష్ట్రప్రభుత్వ ప్రతీకార చర్యలను తట్టుకుంటూ రాష్ట్రంలో న్యాయబద్ధమైన పాలనను కాపాడటానికి హైకోర్టు చేస్తున్న ప్రయత్నం చరిత్రలో నిలిచిపోతుందని.. ఇతర రాష్ట్రాల హైకోర్టులు దీనిని ఆదర్శంగా తీసుకోవాలని వారు అన్నారు. ప్రభుత్వ చర్యలను ఇలాగే ఉపేక్షిస్తే.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సమాధి కట్టినట్లే అని" వారు వ్యాఖ్యానించారు.