IAS officers social service: హైకోర్టు విధించిన సామాజికసేవా శిక్షలో భాగంగా ఆదివారం ఇద్దరు ఐఏఎస్‌లు ఒక విశ్రాంత అధికారి గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఇందుకు అయిన ఖర్చులను వారే భరించారు.
- ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం వట్లూరు బాలికల గురుకుల పాఠశాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆదివారం వచ్చారు. విద్యార్థినులతో ముచ్చటించారు. అక్కడ వసతులపై ఆరా తీశారు. ఆంగ్లభాషపై పట్టు సాధించి, ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. తనతోపాటు తీసుకొచ్చిన చాక్లెట్లను విద్యార్థినులకు పంచారు.
- పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శ్రీకాకుళంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని ఆదివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించి సేవ చేశారు. వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఒక్కరోజు భోజనానికి అయ్యే ఖర్చుకు సంబంధించిన రూ.19,500 చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు. ఈయన హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో 12 నెలల పాటు వివిధ సంక్షేమ వసతి గృహాలను సందర్శించనున్నారు. ఆయన వెంట కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్, డీఈవో పగడాలమ్మ, గిరిజన సంక్షేమశాఖ డీడీ కమల ఉన్నారు.
- విజయనగరంలోని గిరిజన బాలుర వసతి కేంద్రానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి వి.చినవీరభద్రుడు వచ్చారు. ఆదివారం ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 3.45 గంటల వరకు కేంద్రంలోని విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెనూ ప్రకారం ఒక విద్యార్థికి రూ.15 చొప్పున 165 మందికి భోజనానికి అయ్యే ఖర్చు రూ.2,475 చెల్లించారు. స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఆయన వారితో కలిసి భోజనం చేశారు. గ్రూప్స్, సివిల్స్ కొలువులు ఎలా సాధించాలో వివరించారు.
నేపథ్యమిదే:ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, నిర్మాణాలు సరికాదని, వాటిని తొలగించాలని 2020 జూన్ 11న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఏడాదికి పైగా ఆ ఉత్తర్వులను అధికారులు పట్టించుకోలేదు. దీంతో 2021 జులై 12న అప్పటి పంచాయతీరాజ్, పురపాలకశాఖ, పాఠశాల విద్యాశాఖకు చెందిన సీనియర్ ఐఏఎస్‌లపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుచేసింది. తర్వాత కాలంలో ఆ శాఖల బాధ్యతలను నిర్వహించిన ఐఏఎస్‌లను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో మొత్తం 8 మంది ఐఏఎస్‌లపై సుమోటో కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసి విచారణ జరిపి.. తీర్పును వెల్లడించింది.