IAS officer srilakshmi: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో తీర్పును పునఃసమీక్షించాలంటూ ఆమె వేసిన అనుబంధ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించవద్దని, నిర్మించినవి తొలగించాలని న్యాయస్థానం ఆదేశించి ఏడాదైనా అధికారులు పట్టించుకోలేదు. దీనిపై గతంలోనే హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుచేసి విచారణ జరిపింది. కోర్టు ఆదేశాల అమలులో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని తేల్చి, 8 మంది ఐఏఎస్‌లకు ‘సామాజిక సేవ’ చేయాలని శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మార్చి 31న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి వేసిన అనుబంధ పిటిషన్‌ను బుధవారం విచారించిన జస్టిస్ దేవానంద్ కొట్టివేశారు. పునఃసమీక్షించేందుకు పిటిషనర్ తగిన కారణాలు చూపలేకపోయారని పేర్కొంటూ కేసు నేపథ్యంతో పాటు, తమ పరిశీలనకు వచ్చిన విషయాలను ప్రస్తావించారు.
IAS officer srilakshmi: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో షాక్ - ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పిటిషన్‌కి హైకోర్టు షాక్
13:55 April 13
శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం
శిక్ష నేపథ్యమిది:కోర్టు ధిక్కరణ కేసులో పీఆర్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అప్పటి పీఆర్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్య అప్పటి కమిషనర్ వి.చినవీరభద్రుడు, పురపాలకశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలకశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పూర్వ డైరెక్టర్లు జి.విజయ్‌కుమార్, ఎం.ఎం.నాయక్‌లకు హైకోర్టు రెండు వారాల సాధారణ జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించింది. వారు క్షమాపణ కోరుతూనే, కోర్టు ఆదేశాల మేరకు ‘సామాజిక సేవశిక్ష’కు మౌఖికంగా అంగీకరించారు. ఆ ప్రకారం నెలలో ఓ ఆదివారం చొప్పున 12 వారాలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను సందర్శించి, విద్యార్థులతో కాసేపు గడిపి, ఆ పూటకయ్యే భోజన ఖర్చులను సొంతంగా భరించాలని తీర్పు వెలువడింది. దీనిపై రివ్యూ పిటిషన్ వేసిన శ్రీలక్షి తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తాజాగా కోర్టులో వాదించారు. ‘కోర్టు తీర్పు శ్రీలక్ష్మి దృష్టికి వచ్చాక సచివాలయాల తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయలేదు. ‘సామాజిక సేవ’ శిక్ష తీర్పు అమలును నిలిపివేయాల’ని కోరారు. కోర్టుకు సహాయకుడిగా వ్యవహరిస్తున్న ఏజీ ఎస్.శ్రీరామ్ వాదిస్తూ.. ‘కోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆర్నెల్ల తర్వాత శ్రీలక్ష్మి బాధ్యతలు తీసుకున్నారు. సుమోటో కేసులో కోర్టుకు హాజరైన రోజున సచివాలయాల తొలగింపునకు చర్యలు ప్రారంభించారు. ఆమె పిటిషన్ సహేతుకమైనదే’నని పేర్కొన్నారు.
న్యాయాధికారులతో పరిశీలన చేయించాం:న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే 1,134 సచివాలయాలను పూర్తిగా తొలగించామని పాఠశాల విద్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల అధికారులు గతంలో విచారణ సందర్భంగా హైకోర్టుకు నివేదించారు. కోర్టును తప్పుదోవ పట్టించేలా అధికారులు అఫిడవిట్ వేశారా? ఇప్పటికీ పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు కొనసాగుతున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో న్యాయాధికారులతో పరిశీలన చేయించగా, వాస్తవమేనని తేలింది. కొన్నిచోట్ల ప్రాంగణం మధ్యలో ప్రహరీగోడ నిర్మించి సచివాలయాలు కొనసాగిస్తున్నారు. వీటన్నింటిపైనా విచారణ చేయిస్తాం. వీటి నిర్మాణం వల్ల బడి విస్తీర్ణం కుదించుకుపోయిందా లేదా అన్నది సర్వేయర్ తేలుస్తారు. ఈ కారణంగా 8 మంది ఐఏఎస్‌లపై సుమోటో కోర్టు ధిక్కరణ కేసును తిరిగి తెరవడమా(రీ ఓపెన్) లేక కొత్తగా ఓపెన్ చేయడమా అన్నది ఆలోచిస్తాం’ అని పేర్కొన్నారు.
నా తమ్ముడు ఉన్నా అదే శిక్ష :‘సామాజిక సేవ చేయాలంటూ పిటిషనర్‌కు విధించిన శిక్ష న్యాయస్థానం దృష్టిలో అసలు శిక్షే కాదు. అలాంటప్పుడు పునఃసమీక్ష పిటిషన్‌కు విచారణ అర్హత ఎక్కడిది? శ్రీలక్ష్మి బాధ్యతలు తీసుకున్నాక కోర్టు ఉత్తర్వులను సకాలంలో ఎందుకు అమలు చేయలేదు? వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించాకే.. చర్యలు తీసుకున్నారు. కోర్టు తొలుత ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను 8 మంది ఐఏఎస్‌లలో ఎవరైనా చదివారా? అని ప్రశ్నించినప్పుడు, ఒక్కరూ చదవలేదని చెప్పారు. కోర్టు ఆదేశాలకు ఇచ్చే గౌరవమిదేనా? అధికారుల తీరు సరిగ్గా లేదు. నా తమ్ముడు బీఆర్ అంబేడ్కర్ ఇదే రాష్ట్రంలో ఐఏఎస్ అధికారి. ఈ 8 మందిలో తను ఉన్నా ఇదే శిక్ష విధించేవాడిని. రాజ్యాంగానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే’నంటూ శ్రీలక్ష్మి పిటిషన్‌ను కొట్టివేశారు.
ఇదీ చదవండి:
‘అయ్యాఎస్’ సర్వీసు.. రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష