కొవిడ్ లాక్‌డౌన్ అనంతరం ఎదురైన సవాళ్లను అధిగమించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆరునెలలుగా పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయి. ఒక ప్రముఖ స్థిరాస్తి సంస్థే స్వయంగా ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించింది. భూములు, స్థలాలు, విల్లాలు, ఫ్లాట్లు అన్నింటిలోనూ క్రయవిక్రయాలతో మార్కెట్ మంచి ఊపు మీద ఉంది. ఇదే ఉత్సాహంతో పలు సంస్థలు కొత్త ప్రాజెక్టులను ప్రకటించాయి. మరికొన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభించబోతున్నాయి. గృహ నిర్మాణం వరకే పరిమితమైన స్థానిక రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం మున్ముందు డిమాండ్ దృష్ట్యా కార్యాలయాల నిర్మాణ మార్కెట్‌లోనూ మరింతగా విస్తరించే ప్రణాళికలో కొత్త ప్రాజెక్టులతో వస్తున్నాయి. ఎక్కువగా ఐటీ కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వీటిని చేపడుతున్నారు.
నిధుల సమస్య
కొన్ని కంపెనీలకు నిధుల సమస్య ఉండటంతో అంతర్జాతీయ సంస్థలను భాగస్వాములను చేసుకుంటున్నాయి. మరికొన్ని సంస్థలు పీఈ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఎక్కువగా ఈ తరహా పెట్టుబడులు కార్యాలయ, రిటైల్, వేర్‌హౌసింగ్‌లో వస్తున్నాయి. మూడునెలల వ్యవధిలో హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1063 కోట్ల పెట్టుబడులు పెడితే.. అత్యధికం కార్యాలయాల నిర్మాణాల్లోనే ఉండటం విశేషం. దేశవ్యాప్తంగానూ ఇదే పోకడ కనిపించింది. 70 శాతం పీఈ పెట్టుబడులు వీటిలోనే వచ్చాయి. వీటికి డిమాండ్ ఉండటం, స్థిరమైన అద్దెల ఆదాయం వస్తుండటం.. సులువుగా విక్రయించడానికి వీలుండటంతో వీటిలో పెట్టుబడులు పెడుతున్నారని నైట్ ప్రాంక్ ఇండియా ఎండీ శిశిర్ బైజల్ విశ్లేషించారు.
కెనడా నుంచి ఎక్కువగా..
- దేశవ్యాప్తంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 3241 మిలియన్ యూఎస్ డాలర్ల పీఈ పెట్టుబడులు భారత్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టారు. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 16 రెట్లు అధికం. క్రితం సారి 199 మిలియన్ యూఎస్ డాలర్లు మాత్రమే వచ్చాయి.
- రియల్ ఎస్టేట్‌లోనే పీఈల వాటా కార్యాలయాల్లో 71 శాతం ఉండగా.. 15 శాతం రిటైల్, 7 శాతం గృహనిర్మాణం, మరో 7 శాతం వేర్‌హౌసింగ్‌లో వచ్చాయి.
- బెంగళూరు కార్యాలయాల నిర్మాణాల్లో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. మూడు లావాదేవీల్లోనే 1528 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టారు. హైదరాబాద్, చెన్నై కలిపి ఒకే లావాదేవీలో 415 మిలియన్ యూఎస్ డాలర్లు వచ్చాయి.
- పీఈ పెట్టుబడులు ఎక్కువగా కెనడా నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత అమెరికా, సింగపూర్ దేశాలు ఉన్నాయి. స్వదేశీ సంస్థలు కూడా ముందుకొచ్చాయి.
ఈక్విటీ వైపు మొగ్గు..
- పెట్టుబడుల ప్రాధాన్యాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. దశాబ్దపు ఆరంభంలో ఈక్విటీ వైపు మొగ్గు చూపినా.. దశాబ్దపు మధ్య నుంచి డెట్ వాటా పెరిగింది. ఇటీవల రెండేళ్లుగా ఈక్విటీ వాటా పెరుగుతూ వస్తోంది.
- 2011లో పీఈ పెట్టుబడుల్లో 31 శాతం డెట్ ఉంటే.. 69 శాతం ఈక్విటీ ఉండేది. 2014 నాటికి ఇది పూర్తిగా తిరగబడింది. 56 శాతం డెట్‌లో పెడితే 44 శాతం మాత్రమే ఈక్విటీగా పెట్టుబడి పెట్టారు. 2019 నాటికి డెట్ వాటా గరిష్ఠంగా 79 శాతానికి చేరింది. 2020లో ఈక్విటీ వాటా 52 శాతానికి పెరగగా.. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఇది కాస్తా 67 శాతానికి పెరిగింది. మున్ముందు ఇదేవిధంగా కొనసాగుతుందా? లేదా? అనేది కొవిడ్ రెండో ఉద్ధృతి మీద ఆధారపడి ఉంది.