ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్‌లో చైనా వేగు జాడలతో పోలీసుల అప్రమత్తం!

భారత్-బంగ్లా సరిహద్దులో పట్టుబడిన చైనా గూఢచారి హాన్‌ జాన్వేకు సంబంధించిన కీలక విషయాలు బయటపడుతున్నాయి. నగరంలో కొన్నాళ్లు జాన్వే ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తు సంస్థలు, నిఘా వర్గాలు దీనిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. చైనా గూఢచారి నగరానికి ఏ విధంగా వచ్చాడు. అతనికి ఇక్కడ ఎవరు ఆశ్రయమిచ్చారు అనే అంశాలపై నిఘా వర్గాలు లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం.

హైదరాబాద్‌లో చైనా వేగు జాడలతో పోలీసుల అప్రమత్తం!
హైదరాబాద్‌లో చైనా వేగు జాడలతో పోలీసుల అప్రమత్తం!

By

Published : Jun 14, 2021, 8:21 AM IST

భారత్‌-బంగ్లా సరిహద్దుల్లో దొరికిపోయిన చైనా గూఢచారి హాన్‌ జున్వే హైదరాబాద్‌ నగరంలో కొన్నాళ్లు మకాం వేశాడనే సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దర్యాప్తు సంస్థలు, నిఘావర్గాలు కూడా దీనిపై ఆరా తీస్తున్నాయి. జున్వే 2010లో హైదరాబాద్‌లో కొద్దిరోజులు మకాం వేసినట్టు వివరించాడు. ఆ సమయంలో తాను ఎక్కడున్నది.. ఎవరిని కలిశాడనేది వెల్లడించలేదు. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో భద్రతా దళాలు ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది.

దేశంలో హైదరాబాద్‌ మహానగరానిది ప్రత్యేక స్థానం. దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది ఉపాధి, ఉద్యోగాల కోసం ఇక్కడకు వస్తుంటారు. ఉన్నత విద్య, వైద్యం కోసం వేలాది మంది విదేశీయులు రాకపోకలు సాగిస్తుంటారు. దేశరక్షణకు సంబంధించిన పరిశోధన సంస్థలు, విభాగాలు ఇక్కడ ఉన్నాయి. వాయు, పదాతి దళాలకు అవసరమైన ఆయుధాలు, క్షిపణులకు ఇక్కడే రూపకల్పన జరుగుతుంది. ఇంతటి కీలకమైన నగరంపై విదేశీ శక్తులు దృష్టి సారించడం కొత్తేంకాదు. 2014లో హనీట్రాప్‌ ద్వారా పాకిస్థాన్‌కు భద్రతా రహస్యాలు అందజేస్తున్న నాయక్‌ సుబేదార్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశంలో ఉగ్రదాడులకు పాల్పడిన కీలక సూత్రదారులు ఏళ్ల తరబడి నగరంలోనే ఉంటూ నిఘా వర్గాలకు పట్టుబడ్డారు.

ఇటువంటి పరిస్థితుల్లో చైనా గూఢచారి ఉన్నట్టుగా వస్తున్న సమాచారం చర్చనీయాంశంగా మారింది. పదకొండు సంవత్సరాల క్రితం వచ్చిన జున్వేకు ఎవరు సహకరించారనేది కీలకంగా మారింది. అతను నకిలీ పత్రాలు సృష్టించి వందలాది సిమ్‌ కార్డులు కొనుగోలు చేసి తమ దేశానికి తరలించాడు. 1,300కు పైగా సేకరించిన సిమ్‌కార్డుల్లో అధిక శాతం ఇక్కడ కొనుగోలు చేసి ఉంటాడని భావిస్తున్నారు. సైబర్‌ నేరస్థులు, మోసగాళ్లు, అసాంఘిక శక్తులు... దళారుల ద్వారా నివాస ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. వాటి ద్వారా ఓటరు గుర్తింపు, ఆధార్‌ కార్డులను తేలిగ్గా పొందగలుగుతున్నారు. గతంలో అక్రమంగా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చి నగరంలో ఉన్న కొందరికి దళారులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు సహకరించారు. కమీషన్ల కక్కుర్తితో కొందరు జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేతులు కలిపినట్టు దర్యాప్తులో గుర్తించారు. ఒకరిద్దరిని అరెస్ట్‌ చేశారు. చైనా వేగు జున్వేకు సిమ్‌కార్డుల కోసం దళారులు సహకరించి ఉండవచ్చనే కోణంలో పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి. 11 ఏళ్ల క్రితం వచ్చినపుడు ఏ హోటల్‌లో బసచేశాడు. చైనా దేశస్థులు ఎవరైనా సహకరించారా! అనే దానిపై కూడా దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:Nominated Posts: త్వరలో 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు!

ABOUT THE AUTHOR

...view details