రాష్ట్రంలో 2021-22 సీజనులో రైతు భరోసా కేంద్రాల ద్వారా నూరు శాతం ధాన్యం కొనుగోలు చేయించాలని మంత్రి వర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. విజయవాడలోని సివిల్‌సప్లయిస్ భవన్‌లో మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, రంగనాథరాజు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ భాస్కరరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
ప్రస్తుత ఏడాది ధాన్యం కొనుగోళ్లుపై సమీక్షించడంతోపాటు వచ్చే సీజనులో తీసుకోవాల్సిన చర్యలపైనా నిశితంగా చర్చించారు. ధాన్యం మద్దతు ధర నూరు శాతం రైతులకు చేరాలన్నారు. మద్దతు ధర కంటే తక్కువ మొత్తంతో ధాన్యం కొనుగోళ్లు లేకుండా చూడాలని నిర్ణయించారు. అన్ని రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావాలన్న సీఎం సూచనను నూరు శాతం అమలు చేస్తామన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను సీఎంకు అందజేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు.