విజయవాడ నగరం రాజధాని అమరావతికి పక్కనే ఉంటుంది. కానీ నగరంలో ఎక్కడ చూసినా 'టులెట్' బోర్డులే కనిపిస్తున్నాయి. ఏ వీధిలో తిరిగినా గతంలో ఎన్నడూ చూడని విధంగా 30, 40 అద్దె ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. కరోనా కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోయిన కూలీలు, చిన్నచిన్న ఉద్యోగులు కొవిడ్ రెండోదశ వ్యాప్తి తగ్గినా నగరానికి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఉపాధి పనులు లేకపోవడం, నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోవడంతో అద్దెలు కట్టలేమని భావించి సొంతూళ్లలోనే ఉండిపోతున్నారు. దీని కారణంగా నగరవ్యాప్తంగా వందల సంఖ్యలో అద్దె ఇళ్లు నెలల తరబడి ఖాళీగా ఉంటున్నాయి.
మారిన పరిస్థితి...
బెజవాడలో ఒకప్పడు ఇల్లు కిరాయికి దొరకాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. అలా తిరిగినా అనుకున్న వసతులతో అద్దె ఇల్లు దొరకడం గగనంగానే ఉండేది. కొంతమంది అద్దె ఇల్లు కోసం మధ్యవర్తులను సైతం ఆశ్రయించేవారు. కరోనా వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారింది. కరోనా కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోయిన చిన్న చిన్న ఉద్యోగులు, కూలీలు, పిల్లల చదువు కోసం వచ్చిన వారూ తిరిగి నగరానికి రావడం లేదు. నగరంలో ఉపాధి దొరక్కపోవడం, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో అద్దెలు కట్టలేక సొంతూళ్లలోనే ఉండిపోతున్నారని ఇంటి యజమానులు చెప్తున్నారు.