Bhavani devotees at Kanaka Durga temple: కుండపోత వానలోనూ వారికి భక్తి సడలడం లేదు. దూరబారాలనూ లెక్కచేయడండా వస్తున్నారు. కాలినడకలో గాయాలవుతున్నా పట్టించుకోవడంలేదు. కృష్ణవేణి జలాలతో స్నానం చేయడం.. తడిసిన వస్త్రాలతో దుర్గమ్మను కనులారా దర్శించుకోవడం ఒక్కటే తమదీక్షకు ప్రతిఫలంగా వేలాది మంది భవానీదీక్షదారులు భావిస్తున్నారు.
ఆశ్వయుజమాసం.. దసరా ఉత్సవాల సమయంలో- భవానీదీక్షదారులకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేమని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రకటించినప్పటికీ- గురుభవానీలు వెనక్కి తగ్గడం లేదు. గత మూడు రోజులుగా ఇంద్రకీలాద్రి అరుణవర్ణంతో కిటకిటలాడుతోంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అంతా పరిమిత కాలం దీక్షతో దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో- జల్లు స్నానాలు మినహా నదిలో దిగేందుకు పోలీసులు అనుమతించడంలేదు.