తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ప్రజలు వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి.
కీసర టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ
సంక్రాంతి సెలవుల సందర్భంగా.. హైదరాబాద్ నుంచి ప్రజలు సొంతూళ్లకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వచ్చే వాహనాలతో.. కీసర టోల్గేట్ వద్ద రద్దీ ఏర్పడింది. శని, ఆదివారాలు సెలవు కావడం, ఆ తర్వాత సంక్రాంతి పండగ సెలవులను ప్రకటించడంతో.. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆంధ్ర వాసులు సొంత ఊర్లకు పయనమయ్యారు.
టోల్ గేట్ వద్ద వాహనాలు ఆగకుండా టోల్ ప్లాజా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో.. ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాహనాలకు ఫాస్టాగ్ ఉండటంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా టోల్ ప్లాజా నుంచి వెళుతున్నాయి. ఫాస్టాగ్ లేకపోతే కొంత ఆలస్యం అవుతోంది. జాతీయ రహదారిపై అప్పుడే సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది.