తెలంగాణలోని వరంగల్‌లో మత్తు పదార్థాలు కలకలం సృష్టించాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే తొలిసారిగా.. మాదకద్రవ్యాలు లభించాయి. కొకైన్, చరస్‌తో పాటు మరో ఆరు రకాల మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు డ్రగ్స్ సేవిస్తున్న మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
చదువుకునే టైం నుంచే..
"పట్టుబడిన యువకులందరూ స్నేహితులే. చదువుకునే సమయం నుంచే మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారు. మూడేళ్లుగా వీళ్లంతా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు. ఇందులో శివ్వా రోహన్ తరుచుగా.. గోవాకు వెళ్లేవాడు. అక్కడ జాక్, కాల్ జాఫర్ అనే నైజీరియన్ల దగ్గరి నుంచి కొకైన్, చరస్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను తీసుకొస్తాడు. అక్కడి నుంచి తీసుకొచ్చిన మత్తుపదార్థాలను రోహన్ తన స్నేహితులకు అమ్ముతాడు. వారితోనే కలిసి స్థానికంగా వున్న లాడ్జ్‌లలో వాటిని సేవిస్తాడు. ఈ క్రమంలోనే మరో నిందితుడు పెంచికల కాశీరావుతో రోహన్‌కు పరిచయం ఏర్పడింది. కాశీరావు కూడా హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే.. మధ్య మధ్యలో గోవాకు వెళ్లి నైజీరియాకు చెందిన మరో వ్యక్తి వద్ద మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తాడు. రోహన్‌తో పాటు ఇతర యువకులకు అమ్మేవాడు." - తరుణ్‌జోషి, వరంగల్ సీపీ