ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ నేతల గృహ నిర్బంధాలు - House Arrests of the Congress leaders across the state

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన సాగునీటి ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. కేసీఆర్​ వైఫల్యాలను ఎండగడుతూ... ప్రజలకు నిజాలు తెలిసేలా చేయడానికంటూ కాంగ్రెస్​ పార్టీ... పెండింగ్​ ప్రాజెక్ట్​ల వద్ద జలదీక్షకు సిద్ధమైన వేళ పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అనుమతుల్లేవంటూ హస్తం నేతలను ముందస్తుగా గృహ నిర్భంధం చేశారు.

house-arrests-of-the-congress-leaders-across-the-state
house-arrests-of-the-congress-leaders-across-the-state

By

Published : Jun 2, 2020, 7:30 PM IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ప్రాజెక్టుల వద్దకు వెళ్లకుండా ఎక్కడిక్కడ పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. కాంగ్రెస్​ భాగస్వామ్య యూపీఏ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంలో... రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. కేసీఆర్​ వైఫల్యాలను ఎండగడుతూ... ప్రజలకు నిజాలు తెలిసేలా చేయడం కోసం కాంగ్రెస్​ ఈ కార్యాచరణకు పూనుకుంది.

  • ఎవరెవరు - ఎక్కడెక్కడ

ఎస్‌ఎల్​బీసీ వద్ద పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు, పాలేరు జలాశయం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్యలు, పరిగి లక్ష్మీదేవీపల్లి పంప్‌హౌస్ వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిలు, ఏలూరు జలాశయం వద్ద మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి, కరివేన జలాశయం వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద వంశీచంద్‌ రెడ్డిలు దీక్షలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అయితే మంగళవారం నేతల ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు.

  • అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

రాత్రి నుంచే అప్రమత్తమైన పోలీసులు నాయకులను ఇళ్ల వద్దనే గృహనిర్బంధం చేశారు. ఎస్‌ఎల్​బీసీ వద్ద దీక్ష చేసేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి.. మాల్‌ పోలీస్​స్టేషన్‌కు తరలించారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లోని ఆయన నివాసం వద్దే పోలీసులు అరెస్టు చేసి.. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల పోలీస్​స్టేషన్‌కు తరలించారు. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఆయన స్వగృహంలోనే నిర్బంధించారు. ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, సంపత్‌కుమార్‌లను వారి నివాసం వద్దే అరెస్టు చేశారు. అనుమతి నిరాకరణతో ఖమ్మంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దీక్షకు దిగారు. పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్దన్‌ రెడ్డిని మహబూబ్‌నగర్​ శ్రీనివాస కాలనీలోని ఆయన నివాసంలోనే గృహనిర్బంధంలో ఉంచారు.

ఇదీ చూడండి :ఆరేళ్లలో కేసీఆర్ చేసింది శూన్యం: జీవన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details