ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రుచి చూడాల్సిందే.. ఓ పట్టు పట్టాల్సిందే'

TASTY HOTELS: మారుతున్న కాలానికి తగ్గట్టుగా భోజనప్రియుల అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం పెరగడంతో, నాణ్యమైన ఆహారం అందించే హోటళ్లకు గిరాకీ పెరిగింది. విజయవాడ నగరంలో ఎన్ని హోటళ్లు పెట్టినా.. భోజనప్రియుల ఆదరణ ఉంటోంది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆహార సంస్థలన్నీ విజయవాడకు తరలివచ్చాయి. గత రెండేళ్లలో ఇక్కడ విపరీతంగా వెలిశాయి. రుచులతో పాటు నాణ్యతకు, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుండటంతో నగరవాసులు ఓ పట్టు పట్టాల్సిందే అంటున్నారు. వారాంతాల్లో చాలా హోటళ్ల వద్ద పెద్ద జాతరలా మారుతోంది.

TASTY HOTELS
TASTY HOTELS

By

Published : Jul 31, 2022, 12:25 PM IST

TASTY HOTELS: ఈ మధ్యకాలంలో గల్లీకో రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. అక్కడ ఆహారం బాగున్నా.. కొద్దిమంది ఆరోగ్య కారణాల దృష్ట్యా వాటివైపు మొగ్గు చూపట్లేదు. ఆ కారణాలనే అదునుగా చేసుకుని బడా హోటళ్లు ఎవరి ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా వేరైటీ వంటలు, రకరకాల పేర్లతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు తాజాగా విజయవాడలో ఏ హోటళ్లు​ చూసిన జనంతో కిక్కిరిసిపోతున్నాయి.

పేర్ల దగ్గర నుంచి వెరైటీ.. తిన్నంత భోజనం, ఆకలి రాజ్యం, గుడ్‌ వైఫ్‌ రెస్టారెంట్‌, 1960 అలనాటి తిండి, వచ్చి తినిపో.. ఇలా వినియోగదారులను ఆకట్టుకోవడానికి రకరకాల పేర్లు, వెరైటీ సేవలతో పలు హోటళ్లు విజయవాడలో గత రెండేళ్లలోనే అనేకం ఏర్పాటుచేశారు. సోషల్‌ మీడియాలోనూ వీటికి మంచి ప్రచారం లభిస్తుండటంతో నిత్యం రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

పాత రుచులే కొత్తగా..జీవనశైలి వ్యాధుల కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. ఆరోగ్యం కోసం పాతకాలపు రుచులకే జై కొడుతున్నారు. రాగి ముద్ద, కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు, సజ్జలు ఇలాంటి వాటితో చేసే పదార్థాలే కాకుండా నువ్వులు, జొన్న, కొర్రలతో చేసే చిరుతిళ్లూ దొరుకుతున్నాయి. నిర్వాహకులు సైతం వీటినే వెరైటీ కాంబినేషన్లతో అందిస్తున్నారు. చిరుధాన్యాలతో చేసే అల్పాహారాన్ని మాత్రమే ప్రత్యేకించి అందించే ఫుడ్‌ స్టాల్‌లు కూడా పుట్టుకొచ్చాయి.

ఇంటికే అందించేందుకు..

ఒక్క ఫోన్‌ కొడితే ఇంటికే ఫుడ్‌ డెలివరీ చేసే డోర్‌ టు డోర్‌ సర్వీసు సంస్థలు ఇటీవల జోరు పెంచాయి. దీంతో ఈ సౌకర్యం ఉపయోగించుకుని నాణ్యమైన ఆహారం అందించే హోటళ్లు కూడా వెలిశాయి. వీరు కేవలం డోర్‌ డెలివరీ సర్వీసు మాత్రమే అందిస్తుంటాయి. ఆ వంటకాలు నచ్చితే ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇలాంటి హోటళ్లు క్వాలిటీలో మాత్రం తగ్గేదేలేదంటున్నాయి. ప్రత్యేకమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

మీరేం తినాలో వారే చెప్తారు..

ఏదైనా హోటల్‌కు వెళితే మెనూ చేతిలో పెడతారు. కానీ ప్రస్తుతం కొత్త తరహా హోటల్స్‌లో మీ డైట్‌కు అనుగుణంగా తయారుచేసిన భోజనమే వడ్డిస్తారు. ఊబకాయం, బీపీ, షుగర్‌ వంటి వ్యాధులు ఉన్నవారు, కసరత్తులు చేసేవారు తినదగిన పదార్థాలను కంటికి ఇంపుగా వండి వడ్డిస్తారు. కొన్నిహోటళ్లలో సేంద్రియ పద్ధతిలో పండించిన వాటితోనే పదార్థాలు తయారుచేసి పెడుతున్నారు. వీటికి ప్రస్తుతం మంచి ఆదరణ ఉంటోంది.

అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌తో ఆకర్షిస్తూ..

ఒకప్పటిలా తిన్నామా బిల్లు కట్టామా వచ్చేశామా అన్నట్టు కాకుండా కొత్త కాన్సెప్టులతో కస్టమర్లను మెప్పిస్తున్నారు. అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌ అంటూ ఓ ధర నిర్ణయించి.. నాన్‌వెజ్‌, వెజ్‌ ఐటమ్స్‌ను లెక్కకు మించి అందుబాటులో ఉంచుతున్నారు. ఈ హోటళ్లలో నచ్చినంత తినొచ్చు.. కావాల్సినంత సమయం ఉండొచ్చు. దీనికితోడు ఇప్పటికే విజయవాడలో బాగా ఫేమస్‌ అయిన బఫే భోజనం ప్రస్తుతం మరిన్ని హోటళ్లలో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆహారప్రియులు వెరైటీ రుచుల కోసం హోటళ్ల బాట పడుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details