హైదరాబాద్‌లోని చందానగర్ గీతా టాకీస్ వెనుక వీధిలో నివసించే రేషన్ డీలర్, మద్యం దుకాణాల యజమాని, భవన నిర్మాణ సామగ్రి గుత్తేదారు అయిన దొంతిరెడ్డి లక్ష్మారెడ్డి, అర్చన దంపతులకు అవంతి, ఆశిష్‌రెడ్డి సంతానం. వీరి ఇంటికి 150 మీటర్ల దూరంలో చింతా మురళీకృష్ణ, లక్ష్మీరాణి దంపతులు పెద్ద కుమారుడు హేమంత్‌కుమార్(26)తో కలిసి ఉంటున్నారు. వీరి చిన్న కుమారుడు యూకేలో ఉంటున్నాడు. 2018లో అవంతిరెడ్డి బీటెక్ పూర్తి చేసింది. 2013లో డిగ్రీ పూర్తి చేసిన హేమంత్.. రెండేళ్లు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశాడు. తర్వాత సొంతంగా పెయింటింగ్, ఇంటీరియర్ డిజైన్ కాంట్రాక్టులు చేయిస్తున్నాడు. హేమంత్‌కు, అవంతికి మధ్య స్నేహం ఏర్పడి ఎనిమిదేళ్ల కిందట ప్రేమగా మారింది.
జూన్ 10న వివాహం...
ప్రేమ విషయం ఈ ఏడాది మార్చిలో అవంతి తల్లిదండ్రులకు తెలిసింది. కులాలు వేర్వేరు కావడంతో పెళ్లికి అంగీకరించలేదు. ఈ ఏడాది జూన్ 10న బీహెచ్‌ఈఎల్‌కు సమీపంలోని సంతోషిమాత ఆలయంలో ఎవ్వరికి చెప్పకుండా హేమంత్, అవంతి వివాహం చేసుకున్నారు. మరుసటి రోజు కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హేమంత్, అవంతి అధికారికంగా తమ పెళ్లిని నమోదు చేయించుకున్నారు.
అవంతి వివాహం చేసుకున్న విషయం జూన్ 12న ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. ఇంటికొచ్చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. హేమంత్ కుటుంబ సభ్యులనూ బెదిరించారు. ఆందోళనకు గురైన నూతన దంపతులు రక్షణ కల్పించాలంటూ సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కలిశారు. సీపీ సూచన మేరకు ఇరు కుటుంబాలనూ జూన్ 17న చందానగర్ ఠాణాకు పిలిపించి సీఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. అవంతిని హేమంత్ కుటుంబ సభ్యులతో పంపించారు. ఆమె పేరిట మూడు చోట్ల ఉన్న ఆస్తులను తండ్రి లక్ష్మారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు హేమంత్ తల్లిదండ్రులు అంగీకరించారు. నూతన దంపతులను గచ్చిబౌలీ టీఎన్‌జీవోస్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని విడిగా ఉంటున్నారు.
20న హత్యకు బీజం
కుమార్తె చేసిన పనికి పరువు పోయిందంటూ లక్ష్మారెడ్డి, అర్చన తరచూ అంటుండేవారు. ఈనెల 20న అవంతి మేనమామ యుగంధర్‌రెడ్డి ఇంటికొచ్చినప్పుడు చర్చించుకున్నారు. హేమంత్‌ను చంపేయడమే పరిష్కారమని భావించారు. రూ.10 లక్షలు ఖర్చు పెడితే ఆ పని పూర్తవుతుందని యుగంధర్‌రెడ్డి చెప్పాడు. వాళ్లు సరేనని.. అప్పటికప్పుడు రూ.లక్ష ఇచ్చారు. యుగంధర్‌రెడ్డి నేరుగా వట్టినాగులపల్లికి వెళ్లి అక్కడ బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణ, లడ్డూ అలియాస్ మహమ్మద్ పాషాను కలిశాడు. రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా బిచ్చూ యాదవ్‌కు రూ.3వేలు, కృష్ణకు రూ.20వేలు, లడ్డూకు రూ.5వేలు ఇచ్చాడు. పని పూర్తవగానే మిగిలింది ఇస్తానన్నాడు.
టీఎన్జీవోస్ కాలనీలోని హేమంత్ ఇంటి వద్ద.. బిచ్చుయాదవ్ గ్యాంగ్ రెక్కీ నిర్వహించింది. ఈనెల 24న హేమంత్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. లక్ష్మారెడ్డి దగ్గర 20 ఏళ్లుగా సాహెబ్ పటేల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత అతడు బైకుపై టీఎన్జీవోస్ కాలనీకొచ్చాడు. హేమంత్, అవంతి ఇంట్లోనే ఉండడంతో.. ఆ సమాచారాన్ని యుగంధర్‌రెడ్డికి చేరవేశాడు. మధ్యాహ్నం 2-2.30 గంటల మధ్యలో మూడు కార్లలో 15 మంది అక్కడికొచ్చారు.
‘‘నువ్వింటికి రా.. మీ నాన్నను ఒప్పిద్దాం’ అంటూ అవంతిని బలవంతం చేశారు. తన భర్తను కూడా తీసుకెళ్దామంటేనే తాను వస్తానంటూ ఆమె షరతు విధించింది. భర్తతో కలిసి అవంతి తన తల్లి ఉన్న కార్లో ఎక్కింది. అంతకు ముందే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని హేమంత్ తన తండ్రి మురళీకృష్ణకు ఫోన్ చేసి చెప్పాడు. ముందు వెళ్తున్న రెండు కార్లను యుగంధర్‌రెడ్డి అనుసరించాడు. గోపన్‌పల్లి చౌరస్తా వద్ద కార్లు చందానగర్ వైపు కాకుండా వట్టినాగులపల్లి వైపు వెళ్తుండటంతో అవంతి, హేమంత్‌కు అనుమానమొచ్చింది. అదును చూసి బయటకు దూకేశారు. యుగంధర్‌రెడ్డి.. హేమంత్‌ను బలవంతంగా తన కారులో ఎక్కించుకున్నాడు. వాహనాన్ని వేగంగా వట్టినాగులపల్లి వైపు పోనిచ్చాడు. కారులో బిచ్చూయాదవ్, కృష్ణ, లడ్డూ ఉన్నారు. అవంతి తన మామ మురళీకృష్ణకు ఫోన్ చేసింది. ఆయన 100కు ఫోన్ చేసి పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకుని రెండు కార్లను, అవంతి బంధువులను అదుపులోకి తీసుకున్నారు. యుగంధర్ కారు కోసం గాలింపు చేపట్టారు.
నోట్లో వస్త్రం కుక్కేసి...
కారు(స్విఫ్ట్)లో స్థలం సరిపోవడం లేదంటూ వట్టినాగులపల్లిలో లడ్డూను దింపేశారు. జహీరాబాద్‌కు సమీపంలో మద్యం, సుత్లీ(దారం) కొన్నారు. మల్కాపూర్ వద్ద కారును ఆపారు. మూత్రవిసర్జనకు దిగిన హేమంత్ చేతులను సుత్లీతో బిచ్చూయాదవ్, కృష్ణ కట్టేసి కారులో పడేశారు. కాళ్లు కట్టేసి.. కారు తుడిచే వస్త్రాన్ని నోట్లో కుక్కి ఊపిరాడకుండా చేశారు. మెడకు సుత్లీని గట్టిగా బిగించి హతమార్చారు. మృతదేహాన్ని రాత్రి 7.30 గంటలకు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కిష్టయ్యగూడెంలోని ఎంజీ ఎలైట్ స్క్వైర్ వెంచర్‌లోని పొదల్లో పడేసి నగరానికి వచ్చారు.
ఎ ల్లమ్మగుడి దగ్గర ఆగి ఫోన్ చేయడంతో..
తిరుగు ప్రయాణంలో పటాన్‌చెరు- బీడీఎల్ మార్గం మధ్యలోని ఎల్లమ్మగుడి వద్ద ఆగారు. మద్యం కొన్నారు. మద్యం తాగేందుకు రావాలంటూ యుగంధర్‌రెడ్డి తన స్నేహితులైన జగన్, సయ్యద్‌లను ఆహ్వానించాడు. సయ్యద్ కారులో కృష్ణను ఇంటికి పంపించాడు. మేడ్చల్ మండలం రావల్‌కోల్‌లో ఉండే బంధువు సందీప్‌రెడ్డికి యుగంధర్‌రెడ్డి ఫోన్ చేసి.. అన్నం, కూర వండించమని చెప్పాడు. డయల్ 100కు అందిన ఫిర్యాదుతో గోపన్‌పల్లి చౌరస్తా దగ్గర పోలీసులు అవంతి బంధువులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో సంతోష్‌రెడ్డి ఒకరు. రావల్‌కోల్‌కు బయలుదేరే ముందే గుడి దగ్గరి నుంచి యుగంధర్‌రెడ్డి.. పోలీస్ కస్టడీలో ఉన్న సంతోష్‌రెడ్డికి ఫోన్ చేశాడు. అనంతరం యుగంధర్‌రెడ్డి, బిచ్చు యాదవ్ అక్కడి నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా రావల్‌కోల్ వెళ్లారు.
అర్ధరాత్రి 12.30 గంటలకు అదుపులోకి
సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు రావల్‌కోల్‌లో యుగంధర్‌రెడ్డి, బిచ్చూ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పారు.
వాళ్లసలు అమ్మా నాన్నలేనా?: అవంతి, హేమంత్ భార్య
మమ్మల్ని కొట్టినా.. తిట్టినా భరిద్దామని అనుకున్నాం. కానీ.. ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని ఊహించలేదు. వాళ్లసలు అమ్మా నాన్నలేనా..? కూతుర్ని విధవరాలుగా మార్చేస్తారా..? నా భర్త మరణానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కఠినంగా శిక్ష పడాల్సిందే. భవిష్యత్తులో ఏ ఒక్కరికీ నాలాగా అన్యాయం జరగకూడదు. నేను హేమంత్ జీవితంలోకి రాకపోయి ఉంటే జీవితాంతం తను సంతోషంగా ఉండేవాడు. హేమంత్ తల్లికి కొడుకంటే ఎంతో ఇష్టం. ఇప్పుడామెకు కొడుకును ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి..? జీవితాంతం ఈ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది.
బెదిరింపులొచ్చినా పెద్దగా పట్టించుకోలేదు
-మురళీకృష్ణ, హేమంత్ తండ్రి
నేను కులాంతర వివాహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. అందుకే నాకు చెప్పకుండానే హేమంత్.. అవంతిని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కసారి కూడా నేను అవంతి తండ్రి లక్ష్మారెడ్డితో మాట్లాడలేదు. వివాహం తర్వాత మూడు, నాలుగు సార్లు బెదిరింపులొచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. ఇద్దరు పెద్ద మనుషులకు మాత్రం చెప్పా. మాకు ఆస్తులు లేవనే తిరస్కరించారు.
కుల పిచ్చితోనే చంపేశారు: లక్ష్మీరాణి, హేమంత్ తల్లి
హేమంత్ గురువారం ఫోన్ చేసి అవంతి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్తున్నారు... గంటలో వస్తానని చెప్పాడు. బెదిరించి పంపిస్తారని అనుకున్నాం. ఇలా చంపేస్తారని అనుకోలేదు. ప్రేమ వ్యవహారం తెలిసి అవంతిని ఆమె ఇంట్లో వారు ఏడు నెలల ఆరు రోజులు ఇంటి నుంచి బయటకు రానీయలేదు. కుల పిచ్చితోనే నా కుమారుడిని అన్యాయంగా చంపేశారు.
మృతదేహంపై ఆభరణాలు మాయం
కిష్టయ్యగూడెంలో హేమంత్ మృతదేహాన్ని పడేసిన చోటును యుగంధర్‌రెడ్డి, బిచ్చూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులకు చూపించారు. అనంతరం పోలీసులు హేమంత్ మృతదేహం వద్దకు అవంతిని, హేమంత్ తల్లిదండ్రులను తీసుకెళ్లగా వాళ్లు గుర్తుపట్టారు. నాలుగు ఉంగరాలు, బ్రేస్‌లెట్, మెడలో గొలుసు మాయమైనట్లు వారు తెలిపారు. ఈ హత్యతో సంబంధమున్న 18 మందిపై కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ ఇన్‌ఛార్జి డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. యుగంధర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అర్చన, బుచ్చి యాదవ్, విజేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, రజిత, సంతోష్‌రెడ్డి, కైలా సందీప్‌రెడ్డి, స్పందన, స్వప్న, షేక్ సాహెబ్ పాటిల్, గూడూరు సందీప్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కృష్ణ, లడ్డూ, సయ్యద్, జగన్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: