అమలాపురం ఘటనలో ఆందోళనకారులు దాడి చేస్తున్నా.. ఎదురదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసులు నిన్న వ్యవహరించిన తీరు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనమన్నారు. అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో ఆమె సమీక్ష నిర్వహించారు. అమలాపురం విధ్వసకాండకు సంబంధించిన పుకార్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం కాకుండా అంతర్జాలాన్ని నిలిపేశామని చెప్పారు. ఆందోళనలు చెలరేగకుండా అదనపు బలగాలను పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయన్న హోంమంత్రి.. హింసకు పాల్పడిన 46 మంది ఆందోళనకారుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు.
అమలాపురం రణరంగం :కోనసీమ జిల్లా అమలాపురం మంగళవారం ఆందోళనలతో అట్టుడికింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.