House regularizations in Vijayawada : విజయవాడ నగరంలో అద్దెలు కట్టలేని పేదలు, మధ్యతరగతి ప్రజలు కొండలపైనే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు. ఏళ్లతరబడి అక్కడే ఉంటూ ఇప్పుడు పక్కా గృహాలు సైతం నిర్మించుకున్నారు. ఇలా దాదాపు 2 లక్షల మంది కొండలపైనే ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ముఖ్యంగా మొగల్‌రాజపురం, గుణదల, వన్‌టౌన్, చిట్టినగర్ ప్రాంతాల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నివాసాలు కట్టుకుని ఉంటున్నా.. ఆ స్థలంపై వారికి ఎలాంటి హక్కులు లేవు. ఈ స్థలాలు క్రమబద్దీకరించాలని ఏళ్లుగా వారు వేడుకుంటున్నారు.
నగరపాలక ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు హామీలు గుప్పించారు. తప్పకుండా స్థలాలు క్రమబద్దీకరిస్తామని ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావొస్తున్నా.. ఇప్పటికీ వారికిచ్చిన హామీపై కదలిక లేదు. దీనిపై విపక్ష సభ్యులు కౌన్సిల్ సమావేశంలో పట్టుబట్టడంతో.. కంటితుడుపు చర్యగా లబ్దిదారుల పేరుతో ఇంటి పట్టాలను మంజూరు చేశారు.