సంగం డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు బదలాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిని సవాలు చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జూన్ 3కు వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని డెయిరీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఆస్తులను లీజు విధానంలో అమూల్ సంస్థకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎంపీ వ్యాజ్యంలో పేర్కొన్నారు.
హైకోర్టులో విచారణ ప్రారంభంకాగానే.. గురువారం ఉదయం కౌంటర్ వేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ తెలిపారు. కౌంటర్ దస్త్రం ఉదయం 11 గంటలకు అందిందని పిటిషనర్ తరపు న్యాయవాది వి.ఆదినారాయణరావు చెప్పారు. అమూల్ వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రభుత్వ సొమ్ము, సిబ్బంది వనరులను వినియోగించకుండా నిలువరించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అప్పటి వరకు యథాతథాస్థితి(స్టేటస్ కో) పాటిస్తారా అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఎస్జీపీ సానుకూలంగా స్పందించలేదు. దీంతో విచారణ జూన్ 3కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.