ప్రాదేశిక ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండానే బలవంతంగా అడ్డుకున్న అధికారపక్షం...ఉపసంహరణ రోజూ అదే తీరు ప్రదర్శించింది. తమ మాట వినకుండా నామపత్రాలు దాఖలు చేసిన వారు ఉపసంహరించుకునేలా బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగానూ రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఎన్నికల అధికారుల వద్దకు బలవంతంగా లాక్కెళ్లి మరీ నామినేషన్లు ఉపసంహరించుకునేలా వైకాపా నేతలు ప్రయత్నించారు.
ఉపసంహరణకు 20లక్షలు...
మరికొన్ని చోట్ల విపక్ష అభ్యర్థుల నామపత్రాలు సరిగా లేవంటూ అధికారులు తిరస్కరించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని 3వ వార్డు కౌన్సిలర్ స్థానానికి వైకాపా అభ్యర్థి అరుణకుమారి వేసిన నామినేషన్‌పై వివాదం నెలకొంది. ఆమె ఎస్సీ కాదని తెదేపా శ్రేణులు ఆరోపించగా... ఆమెకు కొన్నేళ్ల క్రితమే ఎస్సీ గా కుల ధ్రువీకరణ పత్రం లభించిందని వైకాపా నేతలు వాదించారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ వైకాపా నేతలు 20 లక్షలు ఆశ చూపారని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం తెలుగుదేశం జడ్పీటీసీ అభ్యర్థి శ్రీనివాస్ తెలిపారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామనే।షన్ ఉపసంహరించారంటూ పశ్చిమగోదావరి జిల్లా పెదగరువు భాజపా ఎంపీటీసీ అభ్యర్థి భాను ప్రమీల కన్నీరుమున్నీరుగా విలపించారు. వైకాపా శ్రేణులతో చేతులు కలిపిన పోలీసులు... తమ పార్టీ అభ్యర్థుల చేత బలవంతంగా నామినేషన్లు ఉపసంహరిచుకునేలా చేశారని తెదేపా నేతలు యరపతినేని శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.