ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పురపోరులో ఘర్షణలు, స్వల్ప ఉద్రిక్తతలు.. పోలీసుల లాఠీఛార్జ్

రాష్ట్రంలో చెదురు మదురు ఘటనల మధ్య పురపాలక ఎన్నికలు ముగిశాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా ఘర్షణలు జరిగాయి. రాయలసీమలోనూ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు.

పలు జిల్లాలో ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జ్
పలు జిల్లాలో ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జ్

By

Published : Mar 10, 2021, 7:34 PM IST

Updated : Mar 11, 2021, 7:14 AM IST

పురపోరులో ఘర్షణలు, స్వల్ప ఉద్రిక్తతలు

పురపోరు సందర్భంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఘర్షణలు, స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. విజయవాడ పటమటలోని జెడ్పీ ఉన్నతపాఠశాలలో దొంగ ఓట్లు వేస్తున్నాడని ఓ వ్యక్తిని తెలుగుదేశం అభ్యర్థి కేశినేని శ్వేత..... పోలీసులకు పట్టించారు. ఎనిమిదో డివిజన్‌లో వైకాపా అభ్యర్థి భర్త రాజశేఖర్... తెలుగుదేశం కార్యకర్తలపై చెయ్యి చేసుకున్నారు. దీనిపై తెదేపా అభ్యర్థి చెన్నుపాటి ఉషారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ్‌నగర్‌లోని ఎంకే బేగ్‌ పాఠశాలలో తెదేపా, వైకాపా నేతల మధ్య తోపులాట జరిగింది. 34వ డివిజన్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఒకరు ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని ఒత్తిడి చేస్తున్నారని జనసేన అభ్యర్థి రాధారాణి పోలింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. అతడిని ఎన్నికల విధుల నుంచి అధికారులు తప్పించారు.

గుంటూరు లాడ్జి కూడలిలోని పోలింగ్‌ కేంద్రంలోకి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి రావడం ఉద్రిక్తతలకు దారితీసింది. తెదేపా అభ్యర్థిని బయటకు నెట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా.. వైకాపా శ్రేణులు ప్రతివిమర్శలు చేశారు. పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 42వ డివిజన్‌లోని జేకేసీ కాలేజీ రోడ్డులో 10వ నెంబర్‌ కేంద్రంలో వైకాపా- తెదేపా శ్రేణులు బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో తెదేపా అభ్యర్థికి శ్రీరాంప్రసాద్‌కు గాయాలయ్యాయి.

తెనాలి చెంచుపేటలో తెదేపా అభ్యర్థి బోయపాటి అరుణను వైకాపా నాయకుడు కొట్టాడు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె..తిరిగి చెప్పుతో బదులిచ్చింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. సత్తెనపల్లి 8వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావుపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు కారు అద్దాలను వైకాపా శ్రేణులు ధ్వంసం చేశాయి. చిలకలూరిపేటలో 24వ వార్డు అభ్యర్థి సాంబయ్య ఇంటిపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. బాధితులను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం 12వ వార్డులో వైకాపా, తెదేపా వర్గాల మధ్య తోపులాట జరగ్గా... పోలీసులు చెదరగొట్టారు. పిఠాపురంలో తెదేపా వర్గీయుడిపై వైకాపా కార్యకర్త సీసాతో దాడి చేశాడు. నిరసనగా..తెదేపా శ్రేణులు ఉప్పాడ సెంటర్​లో ఆందోళన చేశారు. పెద్దాపురం 16వ వార్డు కబాడీ వీధిలోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ముగిశాక వైకాపా నేతలు ఉండడంపై వివాదం చోటు చేసుకుంది. తెదేపా వర్గీయులు గదికి తాళం వేయగా.. సమాచారం అందుకున్న వైకాపా సమన్వయకర్త దొరబాబు, స్థానిక ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు చినరాజప్ప పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. ఇరువర్గాల మధ్య కొద్ది సేపు వివాదం చోటుచేసుకుంది.

విశాఖ 31వ వార్డులో పోలింగ్ సమయం ముగిసినా వైకాపా అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోనే ఉండడంపై తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి వానపల్లి రవికుమార్ ఆందోళన చేశారు. 42వ వార్డులో రీ పోలింగ్ నిర్వహించాలంటూ జనసేన, తెదేపా అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించారు. శ్రీకన్య థియేటర్ దగ్గరున్న జీవీఎంసీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులకు సీలు వేసే ప్రకియలో అవకతవకలు జరిగాయంటూ నిరసన తెలిపారు. ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకోకుండానే బ్యాలెట్ పెట్టెలను బస్సుల్లో పంపించడంపై అనుమానం వ్యక్తం చేస్తూ...ఏసీపీ వాహనం ఎదుట బైఠాయించారు. రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

రాయలసీమలో..

రాయలసీమలోనూ స్వల్ప ఉద్రిక్తతల మధ్య పోలింగ్‌ జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గం 16 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సంపత్ కుమారిని స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య భారతి బెదిరించారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను... కాలవ పరామర్శించి తెదేపా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బుద్ధప్పనగర్‌ 25వ నంబర్‌ పోలింగ్ కేంద్రంలో డీఎస్పీ వీరరాఘవ రెడ్డి, సీఐ ప్రతాపరెడ్డి.... భాజపా అభ్యర్థి అశోక్ రెడ్డి పై లాఠీతో దాడి చేశారు. దీనికి నిరసనగా భాజపా శ్రేణులు అక్కడే ధర్నా చేశాయి. వైకాపా కార్యకర్తలాగా డీఎస్పీ వ్యవహరించారని మండిపడ్డారు. 25వ డివిజన్లో రీపోలింగ్‌ జరపాలని డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లా డోన్ 17వ వార్డులో సీఐ సుబ్రమణ్యం అభ్యర్థులపై దురుసుగా ప్రవర్తించారు. ఏకపక్షంగా వ్యవహరించొద్దని సీఐ కాళ్లను తెదేపా అభ్యర్థి గోపాల్ పట్టుకున్నారు. దొంగ ఓట్లు వేస్తున్నవారికి పోలీసులు సహకరించారని అభ్యర్ధి వాపోయారు. కడప జిల్లా జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో అధికార పార్టీకి నాయకులు బెదిరింపులు , దౌర్జన్యాలకు పాల్పడ్డారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు.

తిరుపతి నగరపాలికలో మూడో డివిజన్ తమిళ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి వెళ్లడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు 17వ వార్డుకు చెందిన గిరిజనులు ఓటుకు డబ్బులు ఇవ్వలేదంటూ రోడ్డుపై బైఠాయించారు. జమ్మలపాలెం పక్క వార్డులో ఓటుకు రూ. వెయ్యి పంచారని... తమకూ డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆందోళన చేశారు.

ఇదీచదవండి

ప్రశాంతంగా పోలింగ్.. ఇక మిగిలింది ఫలితమే!

Last Updated : Mar 11, 2021, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details