Imported Coal: థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన 5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు ఏపీ జెన్‌కో ఇటీవల టెండర్లను పిలిచింది. దీనికి అదానీ సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. టన్ను బొగ్గును రూ.40వేలకు సరఫరా చేస్తామని టెండర్లో పేర్కొంది. ఇంత మొత్తం వెచ్చించి బొగ్గు కొనే కంటే.. దేశీయంగా ఉన్న బొగ్గుతో ప్లాంట్లు నిర్వహించడం మేలన్న భావనతో టెండర్ల ప్రక్రియను జెన్‌కో నిలిపేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం విదేశీ బొగ్గుపై పడింది. 4 నెలల్లోనే విదేశీ బొగ్గు ధరలు రెట్టింపయ్యాయి.
గత ఏడాది సెప్టెంబరులో 10 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు జెన్‌కో టెండర్లు పిలిస్తే.. అదానీ, అగర్వాల్ సంస్థలు బిడ్ దాఖలు చేశాయి. ఎల్1గా ఉన్న అదానీ సంస్థ టన్నుకు రూ.19,500 వంతున బిడ్‌లో కోట్ చేసింది. రివర్స్ టెండరింగ్ తర్వాత టన్ను రూ.17,600 చొప్పున సరఫరా చేసేందుకు గుత్తేదారు సంస్థ అంగీకరించింది. ఇదే ఎక్కువని భావించి జెన్‌కో టెండర్లను రద్దు చేసింది. ప్రస్తుతం వేసవిలో థర్మల్ ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేకపోవడంతో విదేశీ బొగ్గు కొనుగోలు కోసం టెండర్లు పిలిచింది. సింగరేణి, మహానది నుంచి వచ్చే బొగ్గుకు రవాణా ఛార్జీలతో కలిపి టన్నుకు రూ.3,600 వంతున జెన్‌కో చెల్లిస్తోంది.