వ్యక్తుల అరెస్టు విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర పోలీసులు తప్పని సరిగా పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమల్లోనే ఉన్నాయని గుర్తుచేసింది. ఆ వివరాలను పునరుద్ఘాటిస్తూ.. ఆ నిబంధలను పోలీసులు ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. రాష్ట్ర పోలీసుల తీరును ఆక్షేపిస్తూ.. దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిగింది.
ఎఫ్‍ఐఆర్ వివరాలు వెల్లడించకుండా అరెస్టులు, రిమాండ్‍లు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. 167 సీఆర్‍పీసీ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఉమేష్‍చంద్ర. పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించిన కోర్టు.. పోలీసుల చర్యలను పరిగణనలోకి తీసుకోకుండానే రిమాండ్ విధించడం హక్కులను భంగపర్చడమే అభిప్రాయపడింది. రిమాండ్ విధించేటప్పుడు సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలని తెలిపింది. అభియోగాల వివరాలు నిందితులకు తెలియజేకపోవడం చట్ట ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. యాంత్రికంగా రిమాండ్లు విధించడం కుదరదని హైకోర్టు తెలిపింది.