Group-1 Interviews: గ్రూప్-1 పోస్టుల ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ షెడ్యూలు ప్రకారం కొనసాగించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. తుది ఫలితాలు న్యాయస్థానం ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చిచెప్పింది. ఆ విషయాన్ని ఎంపికైన వారికి తెలియజేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. పిటిషనర్ల జవాబుపత్రాలు, వారు పొందిన మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని స్పష్టంచేసింది. కౌంటరు వేయాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ విచారణను జులై 14కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
Group-1: గ్రూప్-1 ఇంటర్వ్యూల కొనసాగింపునకు హైకోర్టు ఆదేశం - ap latest news
11:30 June 15
తుది ఫలితాలు కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం
తొలిసారి మూల్యాంకనం చేసిన ఫలితాలను తొక్కిపెట్టి.. మరోసారి పేపర్లను దిద్ది మే 26న ఫలితాలు ప్రకటించిందని ఏపీపీఎస్సీపై పిటిషనర్లు తీవ్రమైన ఆరోపణ లేవనెత్తారని న్యాయమూర్తి గుర్తుచేశారు. రెండు సార్లు మూల్యాంకనం కోసం భారీగా ప్రజాధనం ఖర్చు చేశారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఏపీపీఎస్సీ నుంచి కౌంటరు కోరాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు పిటిషనర్ల వాదనలను ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది తోసిపుచ్చారని తెలిపారు. మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి సాధ్యమైనంత త్వరగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని గతేడాది అక్టోబరులో హైకోర్టు ఆదేశాలిచ్చిందని ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది తెలిపారన్నారు.
ఈనెల 15 నుంచి 29 వరకు 325 మంది ఇంటర్వ్యూ పిలుపు అందుకున్నారని పేర్కొన్నారు. ఈ దశలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిష్ఫలం కాకూడదన్నారు. ఎంపిక ప్రక్రియలో ముందుకెళ్లేందుకు ఏపీపీఎస్సీకి అవకాశం కల్పిస్తున్నామన్నారు. పిటిషనర్ల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియను ఏపీపీఎస్సీ కొనసాగించుకోవచ్చని, ఎంపిక ఫలితాలు కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టంచేశారు. ఈ కేసులో ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడానికి మంగళవారం పొద్దుపోయింది. తర్వాత న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఇవీ చూడండి: