అనాథాశ్రమం, వృద్ధాశ్రమాలకు వెళ్లి ఎనిమిది ఆదివారాలు అక్కడి వారికి అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేయాలని, ఆ ఖర్చులు భరించాలని కోర్టుధిక్కరణ వ్యాజ్యాల్లో ఇద్దరిని హైకోర్టు ఆదేశించింది. ఆశ్రమాల్లో ఉన్నవారితో సమయం గడపాలని స్పష్టం చేసింది. గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్వ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావుకు ఈ మేరకు సమాజసేవ చేయాలని తీర్పు ఇచ్చింది. కోర్టుధిక్కరణ వ్యాజ్యాలపై విచారణను మూసివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి విక్రయాలు నిర్వహించే కమీషన్ ఏజెంట్లకు లైసెన్సు మంజూరు/ రెన్యువల్ చేసేలా ఆదేశించాలని కోరుతూ 2017లో హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం.. రెన్యువల్ చేయాలని ఆదేశాలిచ్చింది. అధికారులు ఆ ఉత్తర్వులను అమలు చేయడంలో జాప్యం చేశారని 2018లో కోర్టుధిక్కరణ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అప్పటి ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, కార్యదర్శి శ్రీనివాసరావు బుధవారం కోర్టులో హాజరయ్యారు.
ఏపీ వ్యవసాయ మార్కెట్ కమిటీల తరఫు న్యాయవాది ప్రకాశం వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలు చేయనందుకు ఛైర్మన్, కార్యదర్శి క్షమాపణలు కోరుతున్నారన్నారు. ఆ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. కోర్టు ఉత్తర్వుల అమల్లో 8 వారాల జాప్యం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. వయసు రీత్యా క్షమించాలని ఇద్దరూ కోరారు. సమాజసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వారు సిద్ధమేనని చెప్పడంతో.. సమాజసేవ చేయాలని ఆదేశిస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టంచేశారు. వాళ్ల సేవపై ఆశ్రమ నిర్వాహకులు ఇచ్చిన ధ్రువపత్రాల్ని ఆయా పరిధిలోని మేజిస్ట్రేట్లు హైకోర్టుకు పంపుతారని స్పష్టంచేశారు. కోర్టుకు ఇచ్చిన హామీకి కట్టుబడకపోతే కోర్టుధిక్కరణ వ్యాజ్యాల్ని పునరుద్ధరిస్తామని తేల్చిచెప్పారు.