ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court: సొంత రాష్ట్రంలోనే హెచ్​ఆర్​సీ కార్యాలయం ఉండాలి - హైకోర్టు తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ మానవహక్కుల కమిషన్‌ కార్యాలయాన్ని సొంత రాష్ట్ర భూభాగం పరిధిలోనే ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఏపీ హెచ్‌ఆర్‌సీని తెలంగాణలో ఏర్పాటు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏపీ ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి ఫిర్యాదులు చేయాలా? అని ప్రశ్నించింది. ఏపీ హెచ్‌ఆర్‌సీ సొంత రాష్ట్రంలోనే ఉండాలని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదని స్పష్టం చేసింది. దీనిపై వెనకాడితే స్వరాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని ఆదేశిస్తామని హెచ్చరించింది.

state human rights commission office
మానహ హక్కుల సంఘం

By

Published : Jul 6, 2021, 5:54 AM IST

Updated : Jul 6, 2021, 7:25 AM IST

సొంత రాష్ట్రంలోనే హెచ్​ఆర్​సీ కార్యాలయం ఉండాలి

రాష్ట్ర మానవహక్కుల కార్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడంపై.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏపీ హెచ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడాన్ని సవాలు చేస్తూ ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి ఏకేఎన్‌ మల్లేశ్వరరావు వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమించినప్పటికి హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ఏర్పాటు చేయలేదని, హెచ్‌ఆర్‌సీ చిరునామా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. పిటిషన్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ఏజీ శ్రీరామ్‌.. హైదరాబాద్‌లోని కాలుష్య నియంత్రణ మండలి భవన్‌లోని ఓ అంతస్తులో ఏపీ హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నామని.. తెలంగాణ ప్రభుత్వం ఆ అంతస్తును స్వాధీనం చేసుకుందని వివరించారు. పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉందని.. ఏపీఈఆర్‌సీ, లోకాయుక్త అక్కడి నుంచే పనిచేస్తున్నాయని చెప్పారు.

తెలంగాణకు వెళ్లి ఫిర్యాదులు చేయాలా?

ఈ వాదనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ఏపీ హెచ్‌ఆర్‌సీని తెలంగాణలో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించిన న్యాయస్థానం.. రాష్ట్ర ప్రజలు తెలంగాణకు వెళ్లి ఫిర్యాదులు చేయాలా? అని నిలదీసింది. తెలంగాణ, ఏపీ ఎవరి పాలన వారు సాగిస్తున్నప్పుడు మరో రాష్ట్రంలో ఏపీ హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.

ఇక్కడే ఉండాలి..

ఏపీ హెచ్‌ఆర్‌సీ సొంత రాష్ట్రంలోనే ఉండాలని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదని స్పష్టం చేసింది. లోకాయుక్త, మానవహక్కుల కమిషన్‌ లాంటి వ్యవస్థలు చాలా ముఖ్యమైనవి అని.. అవి సొంత రాష్ట్రాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. చిన్న రాష్ట్రాలు సైతం స్వరాష్ట్రంలో మానవ హక్కుల సంఘాలను ఏర్పాటు చేసుకున్నాయని గుర్తుచేసింది. రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ కార్యాలయాన్ని సొంత భూభాగం పరిధిలోనే ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. లేనిపక్షంలో తామే అందుకు అనుగుణంగా ఆదేశిస్తామని హెచ్చరించింది.

ధర్మాసనం వ్యాఖ్యలపై స్పందించిన ఏజీ శ్రీరామ్‌.. హైకోర్టు సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, ఆలోచన చేసి ప్రణాళికను కోర్టు ముందు ఉంచుతానని చెప్పారు. మూడు వారాల సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

AP - TS Water Disputes: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయండి: కేంద్రమంత్రికి సీఎం లేఖ

Rayalaseema Lift Irrigation Project: కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Last Updated : Jul 6, 2021, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details