ఐఏఎస్‌గా పనిచేసిన కాలంలో ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవం ఉందా ? అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(sec) నీలం సాహ్ని తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్ఈసీ నియామకం కోసం గవర్నర్‌కు ముఖ్యమంత్రి సిఫారసు చేసిన మూడు పేర్లలో నిర్దిష్ట వయసు, అర్హత ఉన్న వారినే పంపారా ? లేదా ? ఆరా తీసింది. తాజాగా(బుధవారం) జరిగిన విచారణలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి తరపు వివేక్ చంద్రశేఖర్, నీలం సాహ్ని తరపు పీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపించారు. ప్రతివాదుల వాదనలకు తిరుగు సమాధానంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించేందుకు విచారణ ఈ నెల 9కి వాయిదా వేస్తూ... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
నీలం సాహ్ని ఎస్ఈసీ(sec neelam sahni)గా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆమెకు ఎన్నికల విధులను నిర్వహించిన అనుభవం ఉందన్నారు. మరోవైపు న్యాయమూర్తి లేవనెత్తిన పలు ప్రశ్నలకు గవర్నర్ ముఖ్యకార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
విశ్వవిద్యాలయాల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఎంబీబీఎస్(MBBS) మొదటి ఏడాదిలో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు.. రెండో సంవత్సరంలో తరగతులకు అనుమతించేలా ఆదేశించాలని చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. వారు వేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేసింది. వైద్య రంగం ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నందున విశ్వవిద్యాలయ నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం పేర్కొంది. ప్రధాన వ్యాజ్యాల్లో కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.