కరోనా నేపథ్యంలో కారాగారాల(PRISONS) నుంచి ఎంత మంది ఖైదీలు విడుదలయ్యారో అఫిడవిట్ రూపంలో వివరాలు సమర్పించాలని జైళ్లశాఖ డీజీని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) శ్రీనివాసరెడ్డి అభ్యర్థన మేరకు విచారణను పది రోజులకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఖైదీల విడుదలకు ఉన్నతస్థాయి కమిటీ పలు తీర్మానాలు చేసింది. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన వ్యాజ్యంపై ఈ ఏడాది మే 17న విచారణ జరిపి.. అర్హులైన ఖైదీలను 90 రోజుల మధ్యంతర బెయిలుపై విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ వ్యాజ్యం శుక్రవారం మరోసారి విచారణకు రాగా.. అర్హత ఉన్న ఖైదీలను విడుదల చేశామని పీపీ కోర్టుకు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. అర్హులైన వారు కారాగారాల వారీగా ఎంత మంది విడుదల అయ్యారు? వివరాలు దాఖలు చేయాలని ఆదేశించింది.